స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఎన్నికలపై సీఎం కసరత్తు
` ఆశావహుల నివేదిక ఇవ్వండి
` గెలుపే లక్ష్యంగా పనిచేయండి
` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి
` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన
హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కసరత్తును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు జూబ్లీహిల్స్ ఎన్నిక షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చ జరిగింది. ఈ నెల 6న ఏఐసీసీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకు ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి సవిూక్షించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ముగ్గురు మంత్రులకు ఆయన సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులను వివరిస్తూ.. నివేదికలో అభ్యర్థుల పేర్లు, వివరాలు ఉండాలని పేర్కొన్నారు. గెలుపు గుర్రాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిలబెట్టాలన్న కోణంలోనే నివేదిక ఉండాలని సీఎం పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఇన్‌ఛార్జ్ మంత్రులతోపాటు ఎంపీల భాగస్వామ్యంతో వెళ్లాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వర రావు జిల్లా ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జిలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అలానే గెలుపు కోసం అనుసరించే ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలని సూచించారు. ఇక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించుతారా? లేదా ఓసీకి అవకాశం ఇస్తారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. బీసీ కోటాలో అంజాన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ రేసులో ఉన్నారు. రెడ్డి కోటలో సీఎస్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు ఉన్నారు.