స్పష్టత ఇవ్వని పార్టీలను నిలదీయాలి
– జస్టిస్ సుభాషన్‌రెడ్డి
వరంగల్‌లోనైనా స్పష్టత ఇవ్వు బాబూ : కోదండరామ్
హైదరాబాద్, జనవరి 1 (జనంసాక్షి) : తెలంగాణపై స్పష్టత ఇవ్వని పార్టీలను నిలదీయాలని లోకాయుక్త జస్టిస్ సుభాషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన టీఎన్‌జీవోస్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం అఖిలపక్షం నిర్వహించిన తర్వాత ఉద్యమ స్వరూపంలో మార్పు వచ్చిందన్నారు. తెలంగాణపై సందర్భానికో మాట చెబుతూ జాప్యం చేస్తున్న పార్టీలకు ఇక్కడ స్థానం లేదన్నారు. ఆయా పార్టీలపై ఒత్తిడి తేవడం ద్వారా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు అనే భావనతో సీమాంధ్ర నేతలు ఇష్టారాజ్యంగా వనరుల దోపిడీ సాగించారని పేర్కొన్నారు. ఇంకా వారి దోపిడీరాజ్యం కొనసాగబోదన్నారు. ప్రజల్లో చైతన్యం వచ్చిందని తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల ఆకాంక్షను గౌరవించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ప్రజలను ఇంతకాలం కించపరిచి మాట్లాడారని, ఇక్కడి భాష, యాస, కట్టుబొట్టు అవహేళనకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకాలం పెట్టుబడీదారులు తెలంగాణ వనరులను దోచుకొని ఇక్కడి ప్రజలను పేదలుగా మార్చారని తెలిపారు. ఇకపై వారి అకృత్యాలు సాగబోవని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతరూపం దాల్చడంలో ఇక్కడి ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తెలంగాణ సాధించే వరకు అలుపెరగని పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకం కానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలోనైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అఖిలపక్షంలో 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని టీడీపీ ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. తెలంగాణపై వైఖరి తెలపకుండా దాటవేత ధోరణి అవలంబిస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గోడమీది పిల్లిలా వ్యవహరిస్తోందని, ఆ పార్టీలోని నేతలు ఇప్పుడు ఏం చెప్తారని ప్రశ్నించారు. మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఈ మూడేళ్లు సాగిన ఉద్యమం ఒక ఎత్తైతే నెల రోజుల పాటు సాగించబోయే పోరాటం మరో ఎత్తని అన్నారు. ఏ ఒక్కరూ నిర్లిప్తతకు లోనుకాకుండా ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.