స్పష్టమైన హావిూ ఇచ్చే వరకూ విశ్రమించంః చంద్రబాబు నాయుడు

కడప,ఆగస్టు25(జ‌నం సాక్షి ): కడపకు ఉక్కు పరిశ్రమ వచ్చే వరకు పోరాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి స్పష్టమైన హావిూ వచ్చే వరకు విశ్రమించేది లేదని తెలిపారు. కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తున్నామని.. ఎక్కడా కరవు లేకుండా చూస్తున్నామని సీఎం అన్నారు. కడపలోని గండికోటకు నీరు తీసుకొస్తామని హావిూ ఇచ్చారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయంలో 10 టీఎంసీలు నిల్వ చేస్తామని చెప్పారు. పులివెందులకు నీరు ఇస్తామన్న హావిూని నిలబెట్టుకున్న ప్రభుత్వం తమదని పేర్కొన్నారు. కడప జిల్లాలో 90 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు.

కడపలో కూడా జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు. సాంకేతికతను, ప్రకృతిని అనుసంధానం చేసుకోవాలని సూచించారు. అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచానికి మన రాష్ట్రం ప్రకృతి సేద్యానికి కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా జలసంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామన్నారు. గోదావరి నీళ్లు సోమశిలకు తీసుకొస్తామని,

వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు.

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ప్రథమ స్థానంలో ఉన్నామని, సుఖప్రదమైన జీవనానికి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా ఏపీ మారాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేశామని, కేంద్ర ప్రభుత్వం ముందుకు రావట్లేదని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా పట్టుదలతో పనిచేస్తున్నామని, ఉక్కు పరిశ్రమపై కేంద్రం ప్రకటన చేసే వరకూ పోరాడతామని చెప్పారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

 

తాజావార్తలు