స్పీకర్‌ రాజకీయాలకు అతీతుడు

అయినా పార్టీ నుంచి బహిష్కరించి తప్పు చేసిన సిపిఎం

నీతిమంత రాజకీయాలను నడిపిన సోమ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): స్పీకర్‌గా ఉన్న వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ప్రవచించిన కమ్యూనిస్టుఉల సోమ్‌నాథ్‌ ఛటర్జీ స్పీకర్‌గా ఉండగా ఆయనను రాజకీయాల్లోకి లాగారు. కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్న దశలో సోమ్‌నాథ్‌ను రాజీనామయా చేయాలని సిపిఎం ఆదేశించింది. అయితే దీనిని ఆయన ఖాతరు చేయకపోవడంతో పార్టీనుంచి బహిష్కరించారు. సిపిఎం తప్పిదాల్లో ఇది కూడా ఓ చారిత్రక ఘట్టంగా మిగిలిపోయింది. జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకావం వచ్చినా అంగీకరించని సిపిఎం, ఇలా సోమ్‌నాథ్‌ను తప్పించి చారిత్రక తప్పిదంలో పడింది. రాజకీయ కురువృద్ధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛట్టరీ 10 సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి యూపీఏ-1 హయాంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయన 89 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. యూపీఏ-1 ప్రభుత్వంలో సోమనాథ్‌ 14వ లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు. స్పీకర్‌గా తనదైన శైలిలో వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. అయితే 2008లో అణుఒప్పందం అంశంలో మన్మోహన్‌ సర్కార్‌ను తప్పుబడుతూ సీపీఎం మద్దతు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత స్పీకర్‌ పదవిని వదులుకోక పోవడంతో సోమనాథ్‌ను పార్టీ బహిష్కరించింది. ఆ తర్వాత 2009 వరకూ ఆయన స్పీకర్‌గా కొనసాగారు. అయితే పార్టీ నిర్ణయాన్ని పలువురు సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. ముఖ్యంగా పశ్చిమ్‌బంగ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీ బహిష్కరించినప్పటికీ సీతారాం ఏచూరీలాంటి అగ్రనేతలు ఆయనతో టచ్‌లోనే ఉండేవారు. తనను బహిష్కరిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై సోమనాథ్‌ బాధపడ్డారు. తన జీవితంలో అత్యంత బాధకరమైన రోజులు ఇవి అని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు 2009లో ప్రకటించారు. సీపీఎంలో సుదీర్ఘ కాలం పనిచేసిన సోమనాథ్‌ ఛటర్జీ ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1929లో అసోంలోని తేజ్‌పూర్‌ ప్రాంతంలో జన్మించిన ఆయన లండన్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. కోల్‌కతా హైకోర్టులో న్యాయవాదిగా కొంతకాలం పని చేశారు. 1968లో రాజకీయాల్లో ప్రవేశించారు. 1971లో తొలిసారిగా సీపీఎం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009 వరకూ ఆయన పదిసార్లు లోక్‌సభకు ఎన్నికవుతూ వచ్చారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. అదీ ప్రస్తుత పశ్చిమ బంగ సీఎం మమతాబెనర్జీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. బుర్‌ద్వాన్‌, జాదవ్‌పూర్‌, బోలాపూర్‌ నియోజకవర్గాల నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి 2004 వరకూ లోక్‌సభలో సీపీఎం సభాపక్ష నేతగా వ్యవహరించారు. 1996లో సోమనాథ్‌ ‘అవుట్‌ స్టాండింగ్‌ పార్లమెంటేరియన్‌’ అవార్డు అందుకున్నారు.లోక్‌సభకు స్పీకర్‌గా ఆయన పనితీరు ఎందరినో మెప్పించింది. ఆయన్ను బాగా ఎరిగిన వాళ్లు ముక్కుసూటి మనిషి అని అనేవారు. ఆయన తీరు నచ్చని వారు చండశాసనుడు, హెడ్‌మాస్టర్‌, నియంత, హిట్లర్‌ అనిపేర్లు పెట్టేవారు. లంచాలు తీసుకున్న ప్రజాప్రతినిధులను బహిష్కరించినా.. రాజ్యాంగ వ్యవస్థల లక్ష్మణరేఖల గురించి కరాఖండిగా మాట్లాడినా.. విూరిక బాగుపడరని ఎంపీలను కసురుకున్నా.. ఆయనకే చెల్లింది. కోపం, ఆవేశం, చిరాకు ఎక్కువగా ఉండే తాను చీటికీ మాటికీ రెచ్చిపోయే ఎంపీలను నిగ్రహించే స్పీకర్‌ పదవి స్వీకరించడం తనకే అర్థం కాలేదని ఆయన ఓసారి అన్నారు. ఇతర రాజ్యాంగ వ్యవస్థలు శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటే చూస్తూ కూర్చోవడానికి తాను డవ్మిూస్పీకర్‌ను కాదని.. తన వరకూ రాజ్యాంగమే అత్యున్నతమని.. శాసనవ్యవస్థగానీ, న్యాయవ్యవస్థగానీ దాన్ని మించినవి కావని తన వైఖరిని సోమనాథ్‌ అప్పట్లో స్పష్టం చేశారు. తమ అంచనాలకు అనుగుణంగా పనిచేయని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కును ప్రజలకు కల్పించాలని.. రాజకీయ నాయకులకు గరిష్ఠ వయోపరిమితి ఉండాలని.. అప్పుడే యువత రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని సోమనాథ్‌ నమ్మేవారు. ఆయన భారత రాజకీయాల్లో నీతినియమాలను నెలకొల్పిన వ్యక్తిగా నిలిచిపోయారు.