స్వచ్ఛందంగా తరలనున్న ప్రజలు
భారీ సభలు నిర్వహించిన ఘన చరిత్ర టిఆర్‌ఎస్‌ది
అర్వపల్లి సభలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి
సూర్యాపేట,ఆగస్ట్31(జనం సాక్షి): హైదరాబాద్ కొంగర కలాన్‌లో ఆదివారం జరిగే టీఆర్‌ఎస్ ప్రగతి నివేదనసభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భారీ సభల నిర్వహణలో టీఆర్‌ఎస్‌కు దేశంలోనే ప్రత్యేక చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ ఎప్పుడు పిలుపునిచ్చినా రావడానికి లక్షలాది మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రగతి నివేదన సభకు సన్నాహకంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం అర్వపల్లిలో నిర్వహించిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభ సన్నాహక సమావేశాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఉద్యమ సమయంలో అండగా ఉన్నట్టుగానే ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే నడుస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభ తేదీని ప్రకటించిన నాటి నుంచే ఉమ్మడి జిల్లాలో సందడి మొదలైంది. 12అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కనీసం 3లక్షల మందికి తగ్గకుండా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాలోచనల కోసం జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి హైదరాబాద్‌లో వారం రోజుల కిందట సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు నియోజకవర్గస్థాయి సమావేశాలు నిర్వహించి, ఆతర్వాత మండల స్థాయిల్లో సదస్సులు చేపట్టారు. గ్రామ స్థాయిల్లోనూ సమావేశా లు జరిగాయి. సభా స్థలికి సవిూపంగా ఉండే మునుగోడు, దేవరకొండ, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు మిగిలిన అన్ని నియోజకవర్గాల నుంచీ సుమారు 25వేల నుంచి 30వేల మంది తరలి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్న టీఆర్‌ఎస్ యంత్రాంగం అందుకు తగ్గ ఏర్పాట్లను పక్కాగా పర్యవేక్షిస్తోంది.