స్వచ్ఛ నినాదం మన జీవన విధానం కావాలి
విశాఖను స్వచ్ఛత వైపు నడిపించాలి
విశాఖపట్టణం,సెప్టెంబర్2(జనం సాక్షి): ఆరోగ్య పరిరిక్షణ అన్నది మన చేతుల్లో ఉన్న పని అని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని అన్నారు. స్వచ్చత పాటిస్తే అంటురోగాలను దూరంగా పెట్టవచ్చన్నారు. స్వచ్చ భారత్ అన్నది ప్రభుత్వ నినాదం అయినా అది మన జీవన విధానం అయితేనే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దోమల ద్వారా, నీటి ద్వారా వ్యాపించే రోగాలను 90 శాతం తగ్గించుకోవచ్చన్నారు. సంపూర్ణ ఒడిఎఫ్ ఎంపికైన గ్రామానికి చెందిన సర్పంచ్‌ను, అన్ని శాఖల అధికారులను సన్మానించాలని సూచించారు. అందరూ సమిష్టి కృషితో పనిచేసి విశాఖ జిల్లాను శతశాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సాధనకు సమిష్టిగా విశాఖ అడుగులు వేస్తే మంచి పేరు వస్తుందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని గ్రామాలను సంపూర్ణ పారిశుధ్యం, మంచినీటి సరఫరా ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. టెక్నాలజీ పరంగా మన రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో వెనుకబడి ఉండటం శోచనీయమన్నారు. మండల, గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో ముందుకొచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.