స్వల్ప వ్యవధిలో కోహ్లి, ధావన్ అవుట్
సిడ్నీ:ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా స్వల్ప వ్యవధిలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లిల వికెట్లను కోల్పోయింది. తొలుత శిఖర్(78; 56 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్ కు చేరగా, ఆ తరువాత కోహ్లి(8) అనవసరపు షాట్ కోసం యత్నించి రెండో వికెట్ గా అవుటయ్యాడు. 123 పరుగుల వద్ద శిఖర్ వికెట్ ను నష్టపోయిన టీమిండియా.. మరో 11 పరుగుల వ్యవధిలో కోహ్లి వికెట్ ను కోల్పోయింది.ఆసీస్ విసిరిన 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రోహిత్, శిఖర్ లు శుభారంభాన్ని అందించారు. శిఖర్ ధావన్ ఉన్నంతసేపు ఆసీస్ ను పరుగులు పెట్టించాడు. కాగా, శిఖర్ మంచి టచ్ లో ఉన్న సమయంలో హేస్టింగ్ బౌలింగ్ మిడాఫ్ మీదుగా భారీ షాట్ కొట్టి షాన్ మార్ష్ చేతికి చిక్కాడు. కష్టసాధ్యమైన ఆ క్యాచ్ ను షాన్ అద్భుతంగా ఒడిసి పట్టుకోవడంతో శిఖర్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తరువాత క్రీజ్ లో వచ్చిన విరాట్ వచ్చీ రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. అయితే హేస్టింగ్ ఆఫ్ సైడ్ వేసిన బంతి విరాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ వేడ్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో టీమిండియా 22.0 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 139 పరుగుల చేసింది. రోహిత్ శర్మ(50), మనీష్ పాండే(0) క్రీజ్ లో ఉన్నారు.