స్విమ్మింగ్లో ‘త్రిముఖ’ పోరు!

81470379439_625x300రియోడీజనీరో: ఈసారి రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో అమెరికా స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ మరోసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంటున్న ఫెల్ఫ్స్ ..  అమెరికా తరఫున అత్యధిక సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పురుష స్విమ్మర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫెల్ప్స్ 18 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

 కాగా ఒలింపిక్స్ స్విమ్మింగ్ ఈవెంట్ లో ప్రధానంగా మూడు దేశాల మధ్య పోటీ  తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. స్విమ్మింగ్లో అమెరికాతో పాటు, ఆస్ట్రేలియా, చైనా జట్లు బలంగా ఉండటంతో వారి మధ్య త్రిముఖ పోరు ఖాయంగా కనబడుతోంది. అమెరికా జట్టు పురుషుల విభాగంలో మైకేల్ ఫెల్ప్స్ వంటి దిగ్గజ ఆటగాడు బరిలోకి దిగుతుండగా, ఆస్ట్రేలియా జట్టు  కామెరూన్ మెక్వాయ్, చైనా జట్టు నుంచి లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సున్ యాంగ్తో పాటు 2015 వరల్డ్ చాంపియన్ నింగ్ జెటావ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్విమ్మర్ కేట్ క్యాంపబెల్ పతకాలు కొల్లగొట్టే అవకాశం ఉంది. గత నెల్లో 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో వరల్డ్ రికార్డు నమోదు చేసిన క్యాంపబెల్.. రియోలో సత్తా చాటాలని భావిస్తోంది. మరోవైపు  చైనా స్విమ్మర్ యి షివెన్పై ఒలింపిక్స్ పతకాలపై దృష్టి సారించింది. మహిళల విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో వరల్డ్ రికార్డు నమోదు చేసిన యి షివెన్ పతకాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. కాగా, వీరికి జపాన్, దక్షిణాఫ్రికా జట్ల స్విమ్మర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.