హజ్ యాత్రలో విషాదం, 220 మంది మృతి
పవిత్ర హజ్ యాత్రలో విషాదం జరిగింది. సౌదీ అరేబియాలోని మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 220 మందికి పైగా హజ్ యాత్రికులు చనిపోయారు. మరో 400 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మొబైల్ ఆస్పత్రులకు తరలించారు. అన్ని ఆస్పత్రుల దగ్గర ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. సైతానుపై రాళ్లు విసిరేందుకు ఒక్కసారి అంతా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ 20 వేల మంది ఉన్నారు. మరోవైపు, మీనాలో యాత్ర కొనసాగుతోంది. సుమారు లక్ష మంది భారతీయులు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది.
మక్కాలో భారీ దుర్ఘటన జరగడం నెలలో ఇది రెండోసారి. ఈ నెల 12న ప్రధాన మసీదులో భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. 2004 ఫిబ్రవరి 1న జరిగిన దుర్ఘటనలో 254 మంది మృతి చెందారు. 1990 జులై 2న జరిగిన తొక్కిసలాటలో 1426 మంది, 1994 మే 23 జరిగిన తొక్కిసలాటలో 270 చనిపోయారు.