హరితహారం మొక్కల సంరోణ చేపట్టాలి

అందరూ కలస్తేనూ మంచి ఫలితాలు: ఎర్రబెల్లి
హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి):హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే
ఫలితాలు రాబట్టవచ్చని గ్రావిూణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అభిప్రాయపడ్డారు. నర్సరీల్లో మొక్కలు సరైన దశలో వృద్ధి చెందిన విూదటే నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తాజాగా వర్షాభావం ఏర్పడినందున ఇప్పటికే నాటిన మొక్కలను సంరక్షణ బాధ్యతను గ్రామస్థాయిలో తీసుకోవాలని అన్నారు. సర్పంచ్‌ మొదలు వార్డు మెంబర్లు, అధికారులు కూడా ముందుకు రావాలన్నారు. ప్రజలకూడా వీరికి సహకరించి ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా తెలంగాణ ప్రగతిని చాటాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణాల్లో జంక్షన్లు, రోడ్ల సుందరీకరణకు మొక్కలు నాటాలన్నారు. అవసరాలకు ఏయే రకం మొక్కలు ఎన్ని కావాలో సర్వే చేసి తదనుగుణంగా నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టామని తెలిపారు. వీటిని ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించి ప్రభుత్వంతో కలసి రావాలని అన్నారు. ప్రతి జిల్లాను హరిత
జిల్లాగా మార్చాలనీ, ఇందుకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని అన్నారు. రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ చేపట్టాలన్నారు. మూడు ఫీట్లకు పైగా ఉన్న మొక్కలను మాత్రమే నాటాలన్నారు. హరితహారం నిరంతర పక్రియ అని చెప్పారు. ప్రతి ప్రభుత్వ సంస్థల్లో వంద శాతం పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని సూచించారు. అవెన్సూ ప్లాంటేషన్‌ కార్యాచరణ రూపొందించాలనీ, హరితవనాల కోసం స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఏ రకం మొక్కలు ఏయే ప్రదేశాల్లో నాటాలో అటవీ శాఖ అధికారులు సూచనలివ్వాలని, సరైన సమయంలోనే మొక్కలు నాటడం చేపట్టాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌కు పండ్ల మొక్కలను సంబంధిత గ్రామప్రజలతో మాట్లాడి వారి సహాయ సహకారాలతో నాటాలన్నారు. ఈ ఏడాది ఎక్కువ హరిత వనాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నట్లు, వీలైనన్ని చోట్ల అవెన్యూ ప్లాంటేషన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండ్ల మొక్కల్లో అడవి మామిడి పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌లు, కూలీలను హరితమిత్ర అవార్డుకు నామినేట్‌ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.