హరితహారం లో పాల్గొన్న జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

బూర్గంపహాడ్ ఆగష్ట్ 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం, పినపాక పట్టి నగర్, గ్రామపంచాయతీలలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలు సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి స్థానిక మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరై పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జడ్పిటిసి శ్రీలత మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టి, ఆకుపచ్చ తెలంగాణగా మార్చారని అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక తెలంగాణకు హరితహారం అని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛ వాతావరణం అందించేందుకు ప్రతి గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెలు పచ్చగా పరిశుభ్రంగా మారాలని ప్రతి ఒక్కరు కనీసం ఆరు మొక్కలైన నాటాలని అన్నారు. గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల భాగ్యస్యమై ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరి ఇంటి ముందు మొక్కలు నాటినట్లయితే గ్రామం పూర్తిగా పచ్చదనంతో నిండి పోతుందని దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్ రామ్, యం పి ఓ సునీల్ కుమార్, సర్పంచ్ లు భూక్య భారతి, భూక్య పరమేశ్వరి, ఉప సర్పంచ్ లు, ఎక్సైజ్ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సెక్రటరీలు, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.