హరిత విప్లవ పితామహుడు ఇకలేరు!!

` వృద్ధాప్య సమస్యలతో స్వగృహంలో ఆగిన తుదిశ్వాస
` భారత ఆహారాభివృద్ధికి స్వామినాథన్‌ సేవలు అజరామరం
` మేలైన వరి వంగడాలను సృష్టించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా కీర్తి
` రైతులకు దిగుబడి పెంచేందుకు అనేక నూతన ఆవిష్కరణలు
` వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ అందుకున్న తొలి భారతీయుడు
` దేశ వ్యవసాయ రంగం పెద్దదిక్కును కోల్పోయింది : సీఎం కేసీఆర్‌
న్యూఢల్లీి (జనంసాక్షి): భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్‌.ఎస్‌ స్వామినాథన్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్‌ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్‌ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్‌ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్‌. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్‌ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్‌.ఎస్‌ స్వామినాథన్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్‌మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ సైన్స్‌ అవార్డ్‌లతో సత్కరించారు. పద్మ విభూషన్‌, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి.1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్‌ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్‌, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్‌ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్‌కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అనేక సేవలు.. గుర్తింపులు
1972 నుంచి 1979 వరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సంస్థకు జనరల్‌ డైరెక్టర్‌గా స్వామినాథన్‌ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్‌ జనరల్‌గా సేవలందించారు. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రీసోర్స్‌ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫార్మర్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్‌ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్‌ మ్యాగజైన్‌ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది.

(తెలంగాణ వృద్ధి వెనుక స్వామినాథన్‌ స్ఫూర్తి : సీఎం కేసీఆర్‌
ఎం.ఎస్‌ స్వామినాథన్‌ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత భారతదేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడివడి వున్నదనే దార్శనికతతో, సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని ఎం ఎస్‌ స్వామినాథన్‌ వినూత్న పద్దతుల్లో గుణాత్మక దశకు చేర్చారని అన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించిందంటే స్వామినాధన్‌ కృషితోనే సాధ్యమైందన్నారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎం.ఎస్‌.స్వామినాథన్‌ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎంఎస్‌ స్వామినాథన్‌ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో వారికున్న అనుబంధాన్ని సిఎం గుర్తుచేసుకున్నారు. రైతు సంక్షేమం కోసం, సమ్మిళిత వ్యవసాయ రంగ సుస్థిరాభివృద్ధికోసం ఎంఎస్‌ స్వామినాథన్‌ చేసిన సిఫారసులు వారి దార్శనికత రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, కరువు తాండవమాడిన తెలంగాణ నేలన నేడే పసిడి పంటలు పండుతుండడం వెనక, వ్యవసాయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక ఎంఎస్‌ స్పూర్తి ఇమిడి వున్నదని తెలిపారు. ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్‌ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం బాధను కలిగిస్తున్నదని సిఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.
మంత్రులు, నేతల సంతాపం
ఎంఎస్‌ స్వామినాథన్‌ మరణం పట్ల మంత్రి కే. తారక రామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ వ్యవసాయ రంగానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఎంఎస్‌ స్వామినాథన్‌ చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన అనేక పరిశోధనలు, ఆయన చేసిన సిఫార్సులు దేశ వ్యవసాయ రంగానికి ఇతోదికంగా సహాయం చేశాయన్నారు. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రార్థించారు. ప్రపంచ వ్యవసాయ కేంద్రమైన అమెరికాలోని అయివా క్యాపిటల్‌లో వారి చిత్రపటం ఉంచి గొప్పవారుగా కీర్తించడం దేశానికి గర్వకారణమని మంత్రి నిరంజన్‌ రెడ్డి కొనియాడారు. రైతుల గుండెల్లో వారు చెరగని ముద్రవేశారన్నారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితకాలం మొత్తం రైతుల సంక్షేమం గురించి తప్పించిన మహనీయుడని గుర్తుచేశారు.