హిల్లరీకి మద్దతు తెలిపిన ఒబామా
న్యూయార్క్ : డెమోక్రటిక్ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారికంగా సమర్థించారు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఆయన తన మద్దతును ప్రకటించారు. అమెరికా దేశాధ్యక్ష పదవికి హిల్లరీ నూరుశాతం అర్హురాలని ఒబామా బలపరిచారు. ప్రఖ్యాత లిబరల్ పార్టీ నాయకురాలు ఎలిజబెత్ వారెన్ కూడా హిల్లరీ తరపున తన మద్దతును ప్రకటించారు. హిల్లరీ తరపున తాను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు. వైట్‌హౌజ్ రేసులో డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించాలని మాసాచుటెస్ సేనేటర్ వారెన్ అన్నారు.
అమెరికా అధ్యక్ష రేసుకు డెమోక్రటిక్ అభ్యర్థిగా దాదాపు నామినేషన్‌ను ఖరారు చేసుకున్న హిల్లరీ త్వరలో ఆదేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. హిల్లరీ తరుపున ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఒబామా స్పష్టం చేశారు. హిల్లరీ, శాండర్స్ ప్రత్యర్థులే అయినా వాళ్లు అమెరికా క్షేమం కాంక్షించేవాళ్లు అని ఒబామా అన్నారు.
ఒబామా మద్దతు ప్రకటించడమంటే ప్రపంచమే అండగా ఉన్నట్లు హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యానించారు. తనను ఒబామా బలపరడం సంతోషంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా బలమైన పోటీదారులుగా ఉన్న మేము ఇప్పుడు నిజమైన స్నేహితులుగా మారామని ఒబామాను ఉద్దేశించి హిల్లరీ అన్నారు. హిల్లరీకి ఒబామా మద్దతు ఇవ్వడమంటే వాళ్లు మరో నాలుగేళ్ల పాలను కోరుతున్నారని ట్రంప్ ఆరోపించారు.