హిల్లరీతో కలిసి పని చేస్తా : బెర్నీ శాండర్స్

వాషింగ్టన్ : డెమొక్రాట్లు ఏకమవుతున్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునివ్వడంతో బెర్నీ శాండర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. హిల్లరీ క్లింటన్‌తో కలిసి పని చేస్తానని, రిపబ్లికన్ భావిత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హిల్లరీకి మద్దతు తెలిపారు. బెర్నీ శాండర్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో డెమొక్రాట్లు ఊపిరి పీల్చుకున్నారు.
ఒబామాతో దాదాపు గంట సేపు చర్చించిన అనంతరం బెర్నీ శాండర్స్ వైట్ హౌస్ వద్ద మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే చాలా ప్రమాదమన్నారు. ట్రంప్ అధ్యక్షుడు కాకుండా తాను తీవ్రంగా కృషి చేస్తానన్నారు. త్వరలోనే హిల్లరీ క్లింటన్‌తో సమావేశమవుతానని చెప్పారు. ట్రంప్‌ను ఓడించేందుకు ఎలా పని చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. కేవలం ఒక్క శాతం మందికి కాకుండా అందరికీ ప్రాతినిథ్యం వహించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు.