హిల్లరీని చాలా సులువుగా ఓడిస్తా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ను చాలా సులువుగా ఓడిస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాలో ప్రచార సభలో మాట్లాడిన ట్రంప్ నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. ఇటీవల ట్రంప్ ఐదు రాష్ట్రాల ప్రైమరీస్‌లో గెలుపొందిన అనంతరం తానే రిపబ్లికన్ పార్టీ నామినీ అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.
నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మంచి ఫలితాలను చూస్తారంటూ ట్రంప్ తన మద్దతుదారులకు తెలిపారు. ఇప్పటికే తనకు వెయ్యి మంది డెలిగేట్స్ మద్దతు ఉందని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ నామినీగా ఎంపికవ్వాలంటే 1,237 మంది డెలిగేట్స్ మద్దతు కావాల్సి ఉంటుంది. మిగతా రిపబ్లికన్ నేతలు ట్రంప్‌కన్నా వెనుకబడి ఉన్నారు. కాలిఫోర్నియాలో ట్రంప్ ప్రచారం సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా కొందరు ఆందోళనలు చేశారు. ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఆందోళనల కారణంగా ట్రంప్ సభ కాస్త ఆలస్యమైంది.