హిల్లరీనే ప్రెసిడెంట్ – ‘న్యూస్‌వీక్’
అమెరికా ఎన్నికల చరిత్రలో సంచలనం సృష్టించిన అంశం డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికవడం. ఎన్నికల ముందు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన హిల్లరీ క్లింటనే గెలుస్తుందని అందరూ భావించారు. భావించడమేంటీ.. పత్రికల సర్వేలు.. ప్రజల అభిప్రాయాలు.. రాజకీయ నిపుణుల విశ్లేషణలు అన్నీ హిల్లరీ గెలుస్తాయనే చెప్పాయి. అందుకే ప్రముఖ ‘న్యూస్‌వీక్’ పత్రిక తమ నవంబర్ నెల సంచిక అధ్యక్షులుగా ఎవరు గెలిస్తే వారి గురించి ప్రచురించాలని భావించింది. ఇందుకోసం న్యూస్‌వీక్ డిస్ట్రిబ్యూటర్ అయిన టాపిక్స్ మీడియా సంస్థ ‘మేడమ్ ప్రెసిడెంట్’.. ‘ ట్రంప్’ పేరుతో రెండు ప్రత్యేక సంచికలను ప్రచురించింది. సర్వేలు.. ప్రజలు హిల్లరీయే ఎన్నికల్లో గెలుస్తారని నమ్ముతుండడంతో ఎన్నికలు జరగకముందే.. ఎవరు గెలుస్తారో తెలియకముందే హిల్లరీ గెలిచేసినట్లు ‘మేడమ్ ప్రెసిడెంట్’ అన్న కవర్ పేజీతో సంచికను ప్రచురించి నవంబర్ 7లోపే ఏజెన్సీలకు పంపించారు. అయితే 8న పోలింగ్ జరిగి ఆ తర్వాత అసలు ఫలితాలు వెలువడ్డాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో అమెరికానే ఆశ్చర్యపోయింది. దీంతో వెంటనే టాపిక్స్ మీడియా ప్రచురించిన 1.25లక్షల కాపీలను ఏజెన్సీల నుంచి వెనక్కి తెప్పించుకుంటోంది. అయితే అందులో ఇప్పటికే కొన్ని కాపీలు అమ్ముడుపోయాయట.