హిల్లరీనే సరైన నాయకురాలు : ఒబామా
ఫిలడెల్ఫియా: అమెరికాను ముందుకు నడిపించడానికి హిల్లరీ సిద్ధంగా ఉన్నారని, దేశానికి తదుపరి అధ్యక్షురాలు ఆమేనని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్‌కు ఒబామా తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిలడెల్ఫియాలో జరుగుతున్న డెమోక్రటిక్‌పార్టీ కన్వెన్షన్‌లో ఒబామా గురువారం ప్రసగించారు.
ఒబామా ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* సరిగ్గా 12ఏళ్ల క్రితం తొలిసారిగా ఈ కన్వెన్షన్‌లో ప్రసంగించాను. ఆ సమయంలో కాస్త భయపడినా.. నా మీద నాకున్న నమ్మకంతో అంత మంది ప్రజల ముందు నా భావాలను వ్యక్తీకరించగలిగాను.
* మళ్లీ ఇన్నేళ్లకు మీ ముందుకొచ్చాను. అప్పటి కంటే మరింత ఆశావాహ ధృక్పథంతో అమెరికా అధ్యక్షురాలి కోసం ఎదురుచూస్తున్నాను.
* రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. దేశమంతా తిరిగాను. ప్రేమకు ఈ దేశంలో హద్దులు లేవు. ఆశావాహ ధృక్పథంతోనే అమెరికా ముందుకెళ్తొంది.
* ఈ దేశం కోసం ఇప్పటివరకు ఎంతో చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ప్రతి అమెరికన్ మంచి ఉద్యోగం సాధించేలా.. ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేయాలి.
* నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలు సాధారణమైనవి కాదు. అమెరికా ప్రగతికి మూలాధారమైన ఎన్నికలు. గొప్ప నాయకులను ఎన్నుకోడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. ఇందులో యువత పాత్ర కీలకం.
* నేటి యువతరం కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలో వారికి తెలుసు.
* అధ్యక్ష రేసులో సరైన ప్రణాళికతో ఉన్న ఏకైక వ్యక్తి హిల్లరీనే. ఆమే ఈ దేశాన్ని ముందుకు నడిపించగలదు. క్లిష్ట సయమాల్లో ఎలా స్పందించాలో, సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో ఆమెకు బాగా తెలుసు.ఆమె కాకుండా అధ్యక్షుడిగా సరైన వ్యక్తి మరెవరూ లేరు.
* నేను, బిల్ క్లింటన్ కూడా ఆమె కంటే అర్హులమైన వ్యక్తులం కాదేమో.
* ప్రతి అమెరికన్ హక్కులను కాపాడేందుకు ఆమె ఎంతగానో కృషి చేస్తారు.
* ఆ సమయంలో ఎన్నో కీలక విషయాల్లో ఆమె చేసిన సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకున్న సమయంలో హిల్లరీ కీలకమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. లాడెన్‌పై దాడి చేసేందుకు అవి ఎంతగానో ప్రభావితం చేశాయి.
* ఉగ్రవాదాన్ని తరిమికొట్టేందుకు ఆమె నిరంతరం పనిచేస్తారు. ఐసిస్‌ను నాశనం చేసే వరకు విశ్రమించరు.
* అమెరికా తదుపరి కమాండర్ ఇన్ చీఫ్ హిల్లరీనే.
* హిల్లరీని దెబ్బతీసేందుకు చాలా మంది ప్రయత్నించినా.. వారందరికీ ఎదురెళ్లి పోరాడగల సత్తా ఉన్న నాయకురాలు ఆమె.
* అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ ఓ ప్రణాళిక లేని వ్యక్తి. ఆయన నోటి వెంట నిజాలు వినలేము.
* అమెరికా బలహీనమైన దేశమని ట్రంప్ చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మనం ఇప్పటికే చాలా బలంగా ఉన్నాం. మన ధైర్యం, గొప్పతనం ట్రంప్ మాటల మీద ఆధారపడిలేవు.
* 70 ఏళ్లుగా ప్రజల గురించి పట్టించుకోని ట్రంప్ ఇప్పుడు ఛాంపియన్ అవుతారా? అలాంటి వ్యక్తికి ఓటు వేయడం సరైన నిర్ణయం కాదు.