హుజురాబాద్‌ బరిలో గెల్లుశ్రీనివాస్‌ యాదవ్‌


` ఉద్యమకారునికే టీఆర్‌ఎస్‌ టికెట్‌
` శుభాకాంక్షలు తెలిపిన తెరాస నాయకులు, కార్యకర్తలు
హైదరాబాద్‌,ఆగస్టు 11(జనంసాక్షి):హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్‌ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గులాబీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం హిమ్మత్‌ నగర్‌ గ్రామానికి చెందిన గెల్లు మల్లయ్య, లక్ష్మీ దంపతులకు శ్రీనివాస్‌ యాదవ్‌.. 1983, ఆగస్టు 21న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఇదే యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇంటర్‌ వరకు కరీంనగర్‌ జిల్లాలోనే చదివిన శ్రీనివాస్‌.. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వచ్చారు. గగన్‌ మహల్‌లోని ఏవీ కాలేజీలో బీఏ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. అంబర్‌పేటలోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. 2003 నుంచి 2006 వరకు హాస్టల్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ కాలంలో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కేసీఆర్‌ ప్రసంగాలకు ఆకర్షితుడైన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌.. ఆయనకు మద్దతుగా పని చేశారు.
ఈ క్రమంలో ఏవీ కాలేజీలో టీఆర్‌ఎస్వీ అధ్యక్షులుగా (2003`06) గెల్లు కొనసాగారు. 2003`04 విద్యాసంవత్సరంలో బీసీ విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్‌ కోసం ఇందిరా పార్కులో అప్పటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. బొమ్మెర రామ్మూర్తి, బాబా ఫసీయుద్దీన్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ టీఆర్‌ఎస్వీ పట్టణ కార్యదర్శిగా శ్రీనివాస్‌ యాదవ్‌ సేవలందించారు. 2010లో ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడిగా గెల్లు శ్రీనివాస్‌ను బాల్క సుమన్‌ నియమించారు. 2017 నుండి టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్నారు.2010, జనవరిలో తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్రలో భాగంగా.. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఓయూ నుంచి కాకతీయ యూనివర్సిటీ విూదుగా 650 కిలోవిూటర్లు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయడంలో విజయం సాధించారు. 2010 హుజురాబాద్‌ ఉప ఎన్నికలో స్టూడెంట్‌ ఇంచార్జి గా బస్సు యాత్ర (ప్రజా చైతన్య యాత్ర)లో పనిచేశారు. 2011, మార్చిలో మౌలాలి రైల్వే స్టేషన్లలో 48 గంటల రైల్‌ రొఖో ప్రోగ్రాంను వందలాది విద్యార్థులతో కలిసి కేటీఆర్‌ నాయకత్వంలో విజయవంతం చేశారు. 2011, మార్చి 10న నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌లో టీఆర్‌ఎస్వీ తరపున భారీ ర్యాలీ నిర్వహించారు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌.తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి. 2001 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో రెండు సార్లు జైలుకు వెళ్లిన.. శ్రీనివాస్‌ చర్లపల్లి సెంట్రల్‌ జైలులో 36 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. 2004 డిసెంబర్‌ లో విద్యార్థుల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ చేస్తూ నాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఇళ్ళు ముట్టడికి ధర్నా నిర్వహించి అరెస్టు అయ్యారు. 2006 సెప్టెంబర్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో లగడపాటి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు జరిపిన నిరసన ర్యాలీలో అరెస్ట్‌ అయ్యారు.గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తండ్రి గెల్లు మల్లయ్య వీణవంక మండల స్థాయిలో 1985 నుంచి తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్యఅఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్‌ (2000`2005)గా, కొండపాక ఎంపీటీసీ (2001`2005)గా సేవలందించారు. జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్‌ (పశుసంవర్థక శాఖ, ఆంధ్రప్రదేశ్‌)గా ఎన్నుకోబడ్డారు. మల్లయ్య 2004 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా,రైతు బంధు సమితి కోఆర్డినేటర్‌ (కొండపాక)గా పనిచేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తల్లి లక్ష్మీ హిమ్మత్‌ నగర్‌ గ్రామ సర్పంచ్‌ (టీఆర్‌ఎస్‌ పార్టీ) గా సేవలందించారు.