హువాయి ని సవాల్ చేసిన శాంసంగ్
బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం, దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హువాయి టక్నాలజీస్ మధ్య చెలరేగిన పెటెంట్ వివాదంలో మరింత ముదురుతోంది. పేటెంట్ ఉల్లంఘన ఆరోపణలతో చైనా లోని బహుళ కోర్టులో హువాయ్ పై దావా వేసినట్టు శాంసంగ్ శుక్రవారం వెల్లడించింది. తన పేటెంట్ హక్కులను ఆరింటిని హువాయి ఉల్లంఘించిందని కంపెనీ చెబుతోంది. ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చివరికి న్యాయాస్థానానికి ఆశ్రయించినట్టు పేర్కొంది. తమ మేధో హక్కులను కాపాడుకోవడానికి చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.
అయితే తమకుఎలాంటి నోటీసులు రాలేదని.. వస్తే తగినచర్యలు తీసుకుంటామని హువాయి చెప్పింది. మేధో సంపత్తి హక్కుల వివాదాలు చర్చలతో పరిష్కారంకాకపోవడంతో వ్యాజ్యంతో పరిష్కరించడానికి తరచూ సమర్థవంతమైన మార్గంగా ఉంటోందని కంపెనీ వెల్లడించింది.
కాగా తమ 4జీ సెల్యులార్ సమాచార సాంకేతిక, ఆపరేటింగ్ వ్యవస్థలు, యూజర్ ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ పేటెంట్లు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఈ ఏడాది మే నెలలో చైనీస్ సంస్థ హువాయీ…శాంసంగ్ పై అమెరికా, చైనా కోర్టులలో దావా వేసింది. అయితే యాపిల్ శాంసంగ్ మధ్య జరిగిన పేటెంట్ యుద్ధంలో చివరికి శాంసంగ్ విజయం సాధించింది. మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని యాపిల్ చెల్లించాలనికోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఈ తాజా పోరులో విజయం ఎవరిదో వేచి చూడాలి.