హృదయస్పందన ఐసిడిఎస్‌వారి విరాళం అభినందనీయం : కలెక్టర్‌

కరీంనగర్‌, నవంబర్‌ 26 : నిరుపేద చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన హృదయస్పందన కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది 55 వేల విరాళం అందిండం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 13 ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని సిబ్బంది అందించిన 55 వేల విరాళం చెక్కును ఐసిడిఎస్‌ పిడి రాములు సోమవారం జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 12 సంవత్సరాల లోపు పేద కుటుంబాల పిల్లలకు గుండె సంబంధ, ఇతర ప్రాణాంతక వ్యాధుల వైద్య ఖర్చులకు హృదయస్పందన నిధులు వినియోగిస్తామని తెలిపారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే హృదయస్పందన కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు, అన్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చి భారీ విరాళాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి స్త్రీశిశు సంక్షేమ శాఖ పిడి రాములు తదితరులు పాల్గొన్నారు.