హెచ్‌డీఐలో పెరుగుదల సాధించినప్పుడే.. 

10శాతం వృద్ధిరేటు సాధ్యం
– ప్రస్తుతం 7.5శాతం వృద్ధి సాధిస్తున్నాం
– నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌
న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లో పెరుగుదల సాధించినప్పుడే 10 శాతం వృద్ధి రేటు సాధ్యమవుతుందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అన్నారు. పిల్లల హక్కుల సంస్థ ప్లాన్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 7.5 శాతం మేర వృద్ధి సాధిస్తున్నామని, 10 శాతం వృద్ధి సాధించాలంటే హెచ్‌డీఐలో వృద్ధి అవసరమన్నారు. దేశంలో మాతా, శిశు మరణాల్లో రేటు తగ్గనంత వరకూ రెండంకెల వృద్ధి రేటును సాధించడం కష్టమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 200 పైగా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, కేవలం ప్రభుత్వం మాత్రమే వీటిని మార్చడం సాధ్యపడదని అన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆ పనిని చేస్తున్నాయని కొనియాడారు. వివిధ జాతులు, వివిధ మతాలు, వివిధ భాషల సమ్మేళనమైన భారత్‌ అభివృద్ధిలో అటు ప్రభుత్వం పాటు స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ వర్కర్లు కూడా భాగస్వామ్యం కావాలని నటి, సామాజిక కార్యకర్త షబానా ఆజ్మీ పిలుపునిచ్చారు. కాగా ,2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన మానవాభివృద్ధి సూచీలో భారత్‌ 188 దేశాల్లో 131వ స్థానంలో నిలిచిందని అన్నారు.
—————————–