హెచ్-1బీ ప్రీమియం ప్రాసెసింగ్ రద్దు పొడిగింపు
– మరో ఐదు నెలలు పొడిగించిన అమెరికా
వాషింగ్టన్, ఆగస్టు29(జనం సాక్షి) : అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌పై రద్దును మరో ఐదు నెలలపాటు పొడిగిస్తోంది. హెచ్-1బీ వీసాతో విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. భారత ఐటీ నిపుణులు ఎంతో మంది హెచ్-1బీ వీసా కోసం ఎదురుచూస్తుంటారనే విషయం తెలిసిందే. ప్రీమియం ప్రాసెసింగ్ విధానం ద్వారా అదనపు డబ్బు చెల్లించిన వారికి తక్కువ సమయంలో వీసా ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇందుకోసం 1225డాలర్లు (దాదాపు రూ.86వేలు) ఎక్కువగా కట్టాలి. సదరు వీసా దరఖాస్తుపై 15రోజుల్లో యూఎస్‌ఐఎస్ స్పందించాల్సి ఉంటుంది. దీన్ని ఎన్నో ఐటీ కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయి. అయితే దీని వల్ల సాధారణ వీసాలు పెద్ద మొత్తంలో పెండింగ్‌లో పడిపోతున్నందున అమెరికా ప్రభుత్వం ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది.
ప్రీమియం ప్రాసెసింగ్ రద్దును మరో ఐదు నెలలు పొడిగిస్తున్నట్లు అమెరికా పౌరసత్వ వలసల సేవల(యూఎస్‌ఐఎస్) విభాగం మంగళవారం వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 వరకూ ఈ రద్దు కొనసాగనుంది. 2019 సంవత్సరానికి దరఖాస్తు చేసుకుంటున్న హెచ్-1బీ వీసాదారులకు ప్రీమియం ప్రాసెసింగ్‌ను రద్దు చేస్తున్నట్లు యూఎస్‌ఐఎస్ ఈ ఏడాది మార్చిలో వెల్లడించింది. అప్పుడు ప్రకటించిన దాని ప్రకారం 2018 సెప్టెంబరు 10వ తేదీతో గడువు ముగియనుంది. కానీ, రద్దును 2019 ఫిబ్రవరి 19 వరకు కొనసాగిస్తామని యూఎస్‌ఐఎస్ స్పష్టం చేసింది. ప్రీమియం ప్రాసెస్ తాత్కాలిక రద్దు వల్ల హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ సమయం తగ్గిందని తెలిపింది. పిటిషన్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. అమెరికా ఏటా 65వేల హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంది. అందులో మొదటి 20వేలు అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేసిన వారికి కేటాయిస్తారు.