హెచ్‌-1బీ వీసాలపై.. 

మా నిర్ణయంలో మార్పు ఉండదు
– వీసా పాలసీ సంస్కరణల్లో మార్పు చేయలేం
– స్పష్టం చేసిన అమెరికా అధికారులు
వాషింగ్టన్‌, ఆగస్టు31(జ‌నం సాక్షి) : హెచ్‌-1బీ వీసా పాలసీ సంస్కరణ విషయంలో మార్పు చేయబోయేది లేదని అమెరికా స్పష్టం చేసింది. వచ్చే వారం భారత్‌, అమెరికాల మధ్య 2ప్లస్‌2 చర్చలు జరగనుండగా హెచ్‌-1బీ వీసాల అంశం కూడా అమెరికాతో చర్చించాలని భారత్‌ భావిస్తోంది. అయితే అమెరికా మాత్రం తాము వీసా పాలసీ సంస్కరణ విషయంలో మార్పు చేయబోయేది లేదని వెల్లడించింది. విదేశాలకు చెందిన ఉద్యోగులు హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ వీసాను భారతీయులు అధికంగా ఉపయోగించుకుంటున్నారు. అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఏటా భారత్‌, చైనా, తదితర దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. కాగా ట్రంప్‌ యంత్రాంగం మాత్రం ఈ వీసా విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. చాలా ఐటీ కంపెనీలు అమెరికన్లను కాదని ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను ఎక్కువగా నియమించుకుంటున్నాయని అంటోంది. అందుకే ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. భారత కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇటీవల రాజ్యసభలో మాట్లాడుతూ.. వీసాల అంశంపై అమెరికా యంత్రాంగంతో మాట్లాడుతామని, సెప్టెంబరు 6న ఢిల్లీలో జరిగే 2ప్లస్‌2 చర్చల్లో ఈ విషయాన్ని లేవనెత్తుతామని చెప్పారు. కాగా అమెరికా మాత్రం చర్చలకు ముందుగానే తమ నిర్ణయంలో మార్పు ఉండబోదని చెప్తోంది
—————————-