హెరిటేజ్ ఉచిత పశువైద్య, పాడి రైతుల అవగాహన సదస్సు

మునగాల, జూలై (జనంసాక్షి): హెరిటేజ్ పాల సేకరణ కేంద్రం కోదాడ ఆధ్వర్యంలో శుక్రవారం మునగాల మండలంలోని కోదండరాంపురం గ్రామంలో లో ఉచిత పశువైద్య శిబిరం, రైతు అవగాహన సదస్సును గురువారం ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు సంభందించిన పశు వైద్యులు డా.బానోత్ శ్రీను పశువులకు వ్యాధులు సోకకుండ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు. గ్రామంలోని 40 పశువులకు చూడి పరీక్షలు, 40 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. అలాగే గర్భకోశ వ్యాధులు రాకుండా పరీక్ష చేసి రైతులకు తగిన సూచనలు, మేలైన పశుపోషణ పద్ధతులు, దాణా యొక్క ప్రాముఖ్యత వివరించారు. హెరిటేజ్ జనరల్ మేనేజర్ నర్సింగరావు మాట్లాడుతూ, హెరిటేజ్ డిజిటల్ మాధ్యమాల ద్వారా రైతులకు వెటర్నరీ సేవలు అందిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఏరియా మేనేజర్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, హెరిటేజ్ పాలకేంద్రంలో సభ్యత్వం పొందిన ప్రతి రైతుకు రూ.2 లక్షల ప్రమాద బీమాతో పాటు సబ్సిడీ ద్వారా పశువుల బీమా, పశువుల దాణ, నట్టల మందులు అందజేయనున్నట్టు తెలిపారు. ఇందులో మేనేజర్ రజినీకాంత్, సూపెర్వైజర్ మల్లయ్య, పాలకేంద్రం ఏజెంట్ సైదులు, రైతులు భారతమ్మ, కళావతి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.