హేతుబద్దత లేని విభజన వల్లనే కాంగ్రెస్‌ను వీడాం
చంద్రబాబు దక్షత కలిగిన నేత
అందుకే టిడిపిలో చేరి అన్యాయాలపై పోరాడుతున్నాం
ఎంపి గల్లా జయదేవ్
అమరావతి,ఆగస్టు 21(జనం సాక్షి): తమ కుటుంబం అనాదిగా కాంగ్రెస్‌తో ఉన్నా, హేతుబద్ధత లేని రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని ఎంపి గల్లా జయదేవ్ అన్నారు. కాంగ్రెస్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో ఆ విషయాలను ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు దక్షత కలిగిన నాయకుడని, అందుకే తాము టిడిపిలో చేరామని అన్నారు. స్వాతంత్యం రాక ముందు నుంచి మా కుంటుంబం రాజకీయాల్లో ఉంది. మా తాత కాలం నుంచి, మా అమ్మ వరకు కాంగ్రెస్‌తోనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అమ్మ మంత్రిగా పనిచేశారు. విభజన సమయంలోమంత్రి గల్లా అరుణ కుమారి చేసిన ఆందోళనను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగల నేత సీఎం చంద్రబాబు. అందుకు టీడీపీలో మా కుంటుంబం చేరిందని జయదేవ్ చెప్పారు. విభజన హావిూలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ మోసం చేస్తే, విభజన హావిూలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆరోపించారు. ఎన్నో విధాలుగా కేంద్రంపై ఒత్తిడి చేసిన ఫలితం లేదన్నారు. అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదిలేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, విద్యార్థులు కూడా పోరాటానికి మద్దతుగా ఉండాలని జయదేవ్ కోరారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో జయదేవ్ ఏపీ వాదనను బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ కూడా కాంగ్రెస్‌లాగే స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే.. ఏపీ ప్రజలేం అమాయకులు కాదని జయదేవ్ హెచ్చరించారు. విూరిచ్చిన నిధులకంటే బాహుబలి కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోక్‌లు వేసుకుంటున్నారు అని ఎంపీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. ప్రత్యేక ప్యాకేజీ గురించి వెంటనే ప్రకటన చేయాలని జయదేవ్ డిమాండ్ చేశారు. ఇటీవల లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గల్లా ఏపీ సమస్యలపై మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.