హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూత


అన్ని కోర్టులకు సెలవు ప్రకటించిన హైకోర్టు
సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్‌, మంత్రులు
హైదరాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు. జస్టిస్‌ పీ కేశవరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. పేదలకు ఆయన అందించిన న్యాయ సేవలను స్మరించుకున్నారు. జస్టిస్‌ కేశవరావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. న్యాయమూర్తి జస్టిస్‌ పీ. కేశవరావు మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చాలా సాధారణ జీవితం గడిపిన జస్టిస్‌ కేశవరావు మంచి విలువలున్న గొప్ప మానవతావాది అని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ఆకాంక్షించారు. జస్టిస్‌ కేశవరావు మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు. సామాన్యులకు న్యాయాన్ని చేరువ చేయడంలో, న్యాయ వ్యవస్థలో విలువలు కాపాడటంలో జస్టిస్‌ కేశవరావు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. సమాజానికి మేలు చేసిన న్యాయమూర్తికి గౌరవ సూచకంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తోందన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు.