హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు పెంపు
బెంగళూరు:హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనే కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుషీద్ తెలిపారు.శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ సేవా ప్రాధికార నిర్వహించిన ఒక సదస్సులలో ఆయన పాల్గొన్నారు.ఆయన ప్రసంగిస్తూ హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు సుప్రీంకోర్టు జడ్జిల రిటైర్మెంటు వయసుతో సమానంగా ఉండాలనే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.న్యాయ విశ్వవిద్యాలయాలు,న్యాయ కళాశాలలు నిపుణులైన న్యాయకోవిదులను రూపొందించాలని సూచించారు.న్యాయమూర్తులు విదేశీ యాత్రలకు వెళ్లినప్పుడు అక్కడి న్యాయవ్యవస్థను అధ్యయనం చేయాలని సూచించారు.న్యాయమూర్తుల ఎంపిక కోసం ప్రతేక కమిషన్ ఏర్పాటు చేస్తామని చెబుతూ,దీనిపై కొన్ని అభ్యంతరాలు రావడంతో ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్నారు.గ్రామ న్యాయస్థానాల సంఖ్యను పెంచుతామని,ఇప్పటివరకు 165 గ్రామ న్యాయస్థానాలను ఏర్పాటు చేశామని తెలిపారు.కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ విక్రంజిత్‌సేన్ మాట్లాడుతూ రాజీ ద్వారా కొన్ని కేసుల్ని పరిష్కరించవచ్చని,ఇందుకోసం ప్రత్యేక రాజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.