హైకోర్టు విభజనకు..  సుప్రిం సానుకూలత


– డిసెంబర్‌ 15నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి
– కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు
హైదరాబాద్‌, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రింకోర్టు సానుకూలత తెలిపింది. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్‌ వెల్లడించారు. ఆంధప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిలో భాగంగా రెండురోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కోర్టుకు సమర్పించిందన్నారు. హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబరు 15లోగా పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత నోటిపికేషన్‌ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నారీమన్‌ ఇదే విషయాన్ని సోమవారం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వేణుగోపాల్‌.. ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు.