హైదరాబాద్‌ను కాలుష్య రహితనగరంగా మార్చడమే లక్ష్యం


` హిల్ట్‌పాలసి ద్వారా పారిశ్రామిక ప్రాంతాలు కూడా నివాసయోగ్యమవుతాయి
` 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం
` అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం
` మన పిల్లలకు మంచి భవిష్యత్‌ కోసం తపన
` నగరంలోపల ఉన్న పరిశ్రమలను అవతలికి తరలింపు
` నగరంలో పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలన్నదే లక్ష్యం
` పారిశ్రామక ప్రాంతాలను నివాస యోగ్యంగా మారుస్తాం
` శాసనసభ, మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికల్లా 3 ట్రిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. శాసనమండలిలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు సులువుగా ఉండే విధంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ విధానాన్ని తీసుకొచ్చా మన్నారు. తెలంగాణ రైజింగ్‌ సదస్సులో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈనెల 19న మరోసారి వరల్డ్‌ ఎకనమిక్‌ సమిట్‌కు వెళుతున్నామని, భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హ్యూసెంట్రియో, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తూన్నామని అన్నారు. ఉబెర్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని.. త్వరలో ఏర్పాటు చేస్తుందని, కాగ్నిజెంట్‌ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలియజేశారు. పోచారం ఇన్ఫోసిస్‌ సంస్థ విస్తరణ ద్వారా 17 వేల మంది ఉపాధి, విప్రో సంస్థ విస్తరణ ద్వారా మరో 5 వేల మందికి ఉపాధి ఉంటుందని అన్నారు. 70 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని కొనియాడారు. ఇప్పటికే 70 జిసిసిలు రాష్టాన్రికి వచ్చాయని.. సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ లో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే జినోమ్‌ వ్యాలీ నాలుగో దశ కూడా పూర్తయిందని, ఐటీ కంటే ఎక్కువగా ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని అన్నారు. ఏరోస్పేస్‌, రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయని శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు.రేపటి తరాల భవిష్యత్‌ కోసం హిల్ట్‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హిల్ట్‌పాలసీపై చర్చ సంరద్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘హిల్ట్‌పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారు. దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తాం. హిల్ట్‌ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం.. నివాస ప్రాంతంగా మారుతుంది. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం యత్నిస్తున్నారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలివైపునకు తరలిస్తాం అని అన్నారు. ఈ పాలసీ మేము కొత్తగా చేస్తున్నది కాదు. దీనికోసం విస్తృతంగా చర్చలు జరిగాయి. వనరులు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. హిల్ట్‌ పాలసీ గురించి తెలియకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల భూములను.. ప్రభుత్వ భూములని ప్రచారం చేస్తున్నారు. జీవో ఎంఎస్‌ 19కు సంబంధించి లీజు భూములపై ప్రభుత్వానికి సర్వాధికారులు ఉంటాయని గత ప్రభుత్వం జీవో తెచ్చింది. స్వచ్ఛందంగా ముందుకు వస్తే భూములు కన్వర్ట్‌ చేస్తాం. నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలన్నదే మా లక్ష్యం అన్నారు. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలని చూస్తున్నాం. భవిష్యత్‌ గురించి ఆలోచించే మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. మనం ఇన్ఫర్మేషన్‌ రెవల్యూషన్‌లో ఉన్నామని, అంతరిక్షంలో ఇళ్లు కట్టుకోబోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ, ఈ భూమిపై పుట్టిన జీవికి స్వచ్ఛమైన గాలి, నీరు అందించలేని అసమర్థ నాగరికతలో ఉన్నామనేది చేదు నిజం. అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపి, రాబోయే తరాలకు ఒక ’క్లీన్‌ ఎన్విరాన్‌ మెంట్‌’ను అందించడమే లక్ష్యంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ’హిల్ట్‌’ పాలసీకి శ్రీకారం చుట్టిందని మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. చాలా మంది హిల్ట్‌ పాలసీని కేవలం పారిశ్రామిక ప్రాంతాలను నివాస ప్రాంతాలుగా మార్చే ఒక సాదాసీదా ’ల్యాండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌’ పక్రియగా చూస్తున్నారు. కానీ ఇది కేవలం రెవెన్యూ రికార్డుల్లో మార్పు కాదు. ‘పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలికి తరలించి, మన పిల్లలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు విషరహితమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పం. ఇది రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఆరోగ్యకరమైన పునాది అని మంత్రి వివరించారు. 1970వ దశకంలో హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో బాలానగర్‌, సనత్‌ నగర్‌, ఉప్పల్‌, జీడిమెట్ల వంటి ప్రాంతాలు నగరం వెలుపల ఉండేవి. కానీ నేడు..ఈ ప్రాంతాలు నగరం నడిబొడ్డున చేరాయి. ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్‌మెంట్లు వెలిశాయి. పరిశ్రమల చివ్నిూల నుండి వచ్చే విషపూరిత పొగ నేరుగా బెడ్‌రూమ్‌ల్లోకి ప్రవేశిస్తోంది. నివాస గృహాలకు, పరిశ్రమలకు మధ్య ఉండాల్సిన ’బఫర్‌ జోన్‌’ మాయమైపోయింది.మనం మన పిల్లల కోసం కోట్ల ఆస్తులు కూడబెట్టవచ్చు కానీ, వారు పీల్చే గాలి, తాగే నీరు విషతుల్యం అయితే ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటని మంత్రి ప్రశ్నించారు. ఇది ‘బిడ్డలకు బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగమన్నట్టు‘ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదని, మనం ఈ భూమికి యజమానులం కాదని, కేవలం ధర్మకర్తలం మాత్రమేనని గుర్తుచేశారు.చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే అడుగుతో మొదలవుతాయని, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ఆ మొదటి అడుగు తెలంగాణ నుండే ఎందుకు పడకూడదని మంత్రి శ్రీధర్‌ బాబు ఉద్ఘాటించారు. రాజకీయ విమర్శలు పట్టించుకోకుండా, నేల మనుగడ కోసం, పిల్లల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చారిత్రక బాధ్యతను ప్రభుత్వం భుజానెత్తుకుందని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించడం ద్వారా హైదరాబాద్‌ను కేవలం కాంక్రీట్‌ వనంగా కాకుండా, ఒక నివాసయోగ్యమైన మహా నగరంగా మార్చడమే ’హిల్ట్‌’ పాలసీ అంతిమ లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

పారిశ్రామిక భూమి బదలీ విధానంతో స్థిరమైన అభివృద్ధి
` తెలంగాణాతో పాటు హైదరాబాద్‌ అభివృద్ధికి హిల్ట్‌ పునాది రాయి
` పర్యావరణ పరిరక్షణతో పాటు గ్లోబల్‌ మెట్రోపాలిటీన్‌ నగరంగా రూపాంతరం చెందనున్న హైదరాబాద్‌
` విపక్షాల విమర్శలు అర్ధరహితం
` భూమి బదిలీ విధానంలో విపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి
` యాజమాన్యం కలిగిన హక్కు దారులకే ఇది వర్తింపు
` లీజు భూములకు వర్తించదు: మంత్రి ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):పారిశ్రామిక భూమి బదిలీ విధానం తెలంగాణా ప్రాంతంతో పాటు హైదరాబాద్‌ నగరంలో స్థిరమైన అభివృద్ధికి దోహద పడుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన విధానంతో కాలుష్యరహిత గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌ రూపాంతరం చెందుతుందని ఆయన చెప్పారు.మంగళవారం రోజున రాష్ట్ర శాసనసభలో ప్రవేశ పెట్టిన పారిశ్రామిక భూమి బదిలీ విధానంపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా తో పాటు హైదరాబాద్‌ నగరం స్థిరంగా అభివృద్ధి చెందడానికి ఈ విధానం పునాది రాయి వంటిదని అభివర్ణించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక భూమి బదిలీ విధానం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని ఆయన కొట్టిపడేశారు.పారిశ్రామిక భూమి బదిలీ విధానంపై బి.ఆర్‌.ఎస్‌.,బిజెపి లు తమ తమ వైఖరిని స్పష్టం చేయాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.కాలుష్యాన్ని వేద జల్లుతున్న పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ వెలుపలికి తరలించాల వద్దా అన్నది బి.ఆర్‌.ఎస్‌.,బి.జె.పి లు తేల్చిచెప్పాలన్నారు.లీజు హక్కులతో ఉన్న భూములకు ఇది వర్తించదని,పూర్తిస్థాయిలో యాజమాన్యా హక్కులు కలిగిన భూములకు మాత్రమే వర్తిస్తుందని ఆయన సుస్పష్టం చేశారు.ఐదు లక్షల కోట్ల విలువైన తొమ్మిది వేల ఏకరాల భూములను దారి మల్లిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శలు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.విమర్శ కోసం చేసే విమర్శ మాత్రమే నని ఆయన మండిపడ్డారు.హైదరాబాద్‌ మహా నగరాన్ని నివాస యోగ్యంగా రూపొందించేందుకు మాత్రమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.దశాబ్దాలుగా పాతుకపోయిన పరిశ్రమలతో ప్రజలకు నివాసయోగ్యత లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అటువంటి దుర్భర పరిస్థితిని సరిదిద్దేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తెచ్చిందని ఆయన చెప్పారు.హైదరాబాద్‌ తో తనకున్న అనుబంధం అవిబాజ్యామైనదని,నగరంతో ఆయన కున్న సంభందాన్నీ భావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.ఒకప్పుడు హైదరాబాద్‌ లో తనకు వ్యవసాయ భూములు కుడా ఉన్నాయన్నారు.మియపూర్‌ వంటి ప్రాంతాలలో పరిశ్రమలు విరజిమ్ముతున్న కాలుష్యంతో బోరు బావుల నుండి రంగు మారిన నీరు వస్తుందని ఆయన పేర్కొంటూనే కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల తరలింపు ఎంత అవసరమో అన్నది ఆయన సభకు వివరించారు.నూటికి నూరు శాతం రిజిస్ట్రేషన్‌ విలువ చెల్లించాలని నిబంధన పెడితే పరిశ్రమలు ఎందుకు పోతాయన్న కోణంలో వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.భూముల ధరల విషయంలోను ప్రభుత్వం న్యతమైన విధానాన్ని అనుసరిస్తుందని 80 అడుగుల వెడల్పు రహదారి సౌకర్యం కలిగిన భూములకు రిజిస్ట్రేషన్‌ విలువలో 50 శాతం,80 అడుగుల కంటే తక్కువ ఉన్న వాటికి 30 శాతంగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడిరచారు.పరిశ్రమల అభివృద్ధి,పర్యావరణ పరిరక్షణ ల మధ్య సమతుల్యత పాటించేందుకే పారిశ్రామిక భూమి బదిలీ విధానం లక్ష్యమని,ప్రజల ప్రయోజానార్థం దీనిని రూపొందించామని,ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలులోకి తెస్తుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సభకు తెలిపారు.

పరిశ్రమలను మూసివేసేలా హిల్ట్‌ పాలసీ
` లోపాలు సవరించాలి
` భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):జీవో 27 చాలా వివాదాస్పదంగా ఉందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. హిల్ట్‌ పాలసీపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘ జీవో లీక్‌ కావడంపై ప్రభుత్వంలో ఆందోళన ఉంది. టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్‌లు ఉండాలని జీవో 27లో ఉంది. అతితక్కువ ధరకు భూములు ఇచ్చారు. హిల్ట్‌ పాలసీకి సంబంధించి సబ్‌ కమిటీ నిర్ణయాలను బయటపెట్టలేదు. 22 పారిశ్రామికవాడలను అన్యాక్రాంతం చేస్తున్నారు. ఫార్మాసిటీకోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఫోర్త్‌ సిటీకి ఉపయోగిస్తున్నారు. ఆ భూములపై హైకోర్టు ఆఫిడవిట్‌ అడిగింది. పరిశ్రమలను మూసివేసేలా ప్రస్తుత పాలసీ ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలో తప్పులు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల భూములను రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 43,342 జీవోలు దాచి పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం 19,064 జీవోలు ఇస్తే.. 3,290 జీవోలు మాత్రమే పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నాయి’’ అని ఆరోపించారు.

 

 

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడిరది. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 40 గంటల 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చ జరిగిందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలిపారు. సభలో 66 మంది సభ్యులు మాట్లాడారని, 13 బిల్లులు, నాలుగు లఘు చర్చలు జరిగినట్లు ప్రకటించారు. శాసనసభలో రెండు తీర్మానాలు చేసినట్లు వెల్లడిరచారు.