హైదరాబాద్ అతలాకుతలం
భారీ వర్షంతో నీటమునిగిన భాగ్యనగరం
నీట మునిగి కొట్టుకుపోయిన కార్లు, టూ వీలర్లు
నీట మునిగిన పలు కాలనీలు..సహాయం కోసం ఎదురుచూపు
పలుచోట్ల ప్రజలను సహాయక శిబిరాలకు తరలింపు
వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కెటిఆర్
బాధితులకు భరోసా….సహాయక చర్యలు ముమ్మరం
హైదరాబాద్,అక్టోబర్14(జనంసాక్షి): భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయ్యింది. కాలనీలన్నీ నిండా మునిగాయి. కార్లన్నీ నీట మునిగాయి. కనీవినీ ఎరుగని కల్లోలం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. వందలాది కుటుంబాలు నీట మనుగడంతో మిద్దెలు ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. నాలాలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. వరద ఉదృతికి కార్లు సహా పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను వరద నీరు ముచెత్తింది. గత 24 గంటల్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 20 సెం.విూకు పైగానే వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. సికింద్రాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కింద పార్క్ చేసిన కారుపైకి వరద ప్రవాహానికి మరో కారు వచ్చి చేరింది. ఇంకో వైపు నుంచి మూడవ కారు కూడా వచ్చి వాటిని ఢీకొట్టిన దృశ్యాలు వరద భీభత్సానికి అద్దం పడుతోంది. భారీ వాహనాలు సైతం నీళ్లలో తేలుతూ కొట్టుకు పోయాయి. కారులో డ్రైవర్ లేకున్నా అత్యంత వేగంగా వాహనాలు కదులుతూ కనిపిస్తుండటంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. పలు అపార్‌మెంట్ సెల్లార్‌లోకి సైతం భారీగా వరద నీరు రావడంతో వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అత్యవసం అయితే తప్పా ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో జన జీవనం స్తంభించింది. పలు ప్రాంతాలో వరదలో చిక్కుకుపోయాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా ముంపునకు గురైన ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు సవిూపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఆహారం అందిస్తున్నారు. అలాగే పలు చోట్ల ప్రభుత్వం సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో వారికి ఆహారంతో పాటు అవసరమైన వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ¬ం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వరద పరిస్థితిని సవిూక్షించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ముంపు బాధితులతో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అదుకుంటామని, ఆందోళనపడొద్దని సూచించారు.
వరద ప్రాంతాల్లో కెటిఆర్ పర్యటన
హైదరాబాద్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ముంపు బాధితుల సమస్యలను కేటీఆర్ ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ముసారాంబాగ్‌లోని సలీంనగర్‌లో బుధవారం మధ్యాహ్నం కేటీఆర్ పర్యటించి.. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. వానలు తగ్గే సూచన లేదు. ఇప్పుడు ఎక్కడైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారు.. మరో రెండు రోజుల పాటు కూడా అక్కడే ఉండాలని ముంపు బాధితులకు కేటీఆర్ సూచించారు. బాధితులందరికి వైద్య పరీక్షలు చేయించి, మందులు ఇస్తామన్నారు. భోజనం పెడుతామన్నారు. దుప్పట్లు కూడా సరఫరా చేస్తామన్నారు. వీటితో పాటు నష్ట పరిహారం కూడా చెల్లిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యలపై శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ రాత్రి 12 గంటల వరకు వర్షాలు, వరదలపై సవిూక్షించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రేటర్‌లో డీఆర్‌ఎఫ్ వ్యవస్థ ఉందన్నారు. వరద ప్రాంతాల్లో దాదాపు 40 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా 80 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త తీసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రమాదకర స్థలాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ సిటీలో కొంతమందికి నోటీసులు ఇచ్చామన్నారు. భవనాలు ఖాళీ చేయని వారిని బలవంతంగానైనా చేయిస్తామన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు, మేయర్, డిప్యూటీ మేయర్ జోన్ల పర్యవేక్షణలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ గేట్లను ఓపెన్ చేశామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా నిరంతర పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం వరదలపై హైఅలెర్ట్‌గా ఉందన్నారు. అపార్ట్‌మెంట్‌లు, సెల్లార్ల వద్ద తగు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్ వెల్లడించారు.