హోంగార్డుల హక్కుల సాధన కోసం నేను ముందుంటా!

దయచేసి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులను ఆగం చేయొద్దు.. ఆత్మహత్య చేసుకోవద్దు
– పోరాడదాం.. హక్కులను సాధించుకుందాం
– హోం గార్డులకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి భరోసా
– రవీందర్ ను పరామర్శించి.. కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచ్చిన కిషన్ రెడ్డి

ఆత్మహత్యకు ప్రయత్నించి హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్‌​ను కంచన్​బాగ్​ అపోలో హాస్పిటల్​లో పరామర్శించిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణలో హోంగార్డుల విషయంలో శ్రమదోపిడీ జరుగుతోంది. వారికి కనీస హక్కులు ఇవ్వడం లేదు.
హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా అవమానిస్తున్నది.
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డుల హక్కులు, సంక్షేమం కోసం చట్టసభలో ప్రభుత్వాన్ని నిలదీశాను.
వీళ్ల విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరచలేదు.
8 గంటల చేయాల్సిన ఉద్యోగాన్ని 16, 24 గంటలు పనిచేస్తున్నారు.
హక్కుల కోసం గతంలో హోంగార్డులు పోరాటం చేస్తే.. ఆ సంఘ నాయకులను వేధించారు. కానీ.. న్యాయం చేయలేదు.
హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలి. సెలవులు, ఇతర అలవెన్సులు ఇవ్వాలి.
వారి ఆరోగ్యం విషయంలో కూడా సరైన చర్యలు తీసుకోవాలి.
హోంగార్డులకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్లు ఇస్తానని ఇవ్వకపోవడంతో వారికి న్యాయం జరగలేదు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోంగార్డులకు ఇచ్చిన హామీని అయిదున్నరేండ్ల దాటినా.. అమలు చేయడం లేదు.
రవీందర్​ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం చాలా బాధాకరం.
ఎండ, వాన ఇతర ఇబ్బందుల్లో హోంగార్డులు విధుల్లో స్పృహ తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలి.
రవీందర్​ ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
రవీందర్​ కుటుంబానికి మేము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాం..
రవీందర్​ ప్రాణాలతో బయటకు రావాలి. ఇది రాజకీయం చేయాల్సిన విషయం కాదు. ఓ వ్యక్తి ప్రాణానికి సంబంధించిన విషయం.
ఈరోజు హోంగార్డుల పరిస్థితి దారుణంగా ఉంది.
హోంగార్డుల వ్యవస్థను మెరుపరిచేందుకు చర్యలు తీసుకోవాలి.
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డుల సంక్షేమం కోసం అన్నిరకాలుగా కృషి చేస్తాం.
హోంగార్డులు ధైర్యంగా ఉండి పోరాడాలి. కానీ..ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నాను.
హోంగార్డుల హక్కుల కోసం శాంతియుతంగా అందరం కలిసి పోరాటం చేద్దాం.. ఎవరూ తొందరపడొద్దు.
రవీందర్​ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటాం.. రవీందర్​ ఆరోగ్యాన్ని కాపాడేందుకు పూర్తి ప్రయత్నం చేస్తాం.

హోంగార్డుల శాంతియుత ధర్నా కు మద్దతు తెలిపిన కిషన్​ రెడ్డి.. అక్కడ వాళ్లతో మాట్లాడారు.

గత 17 సంవత్సరాలుగా హోంగార్డుగా సేవలు అందిస్తున్న రవీందర్​ ఆత్మహత్యయత్నానికి పాల్పడటం దురదృష్టకరం.
ఎంతో దుఖం, బాధతో రవీందర్​ ఆ ప్రయత్నం చేసి ఉంటాడు.
హోంగార్డుల విషయంలో అనేకసార్లు పోరాటం చేశాను.. అప్పట్లో నాపై కేసులు కూడా పెట్టారు.
ఆరోజు హోంగార్డులు వారి హక్కుల కోసం పోరాడితే… సంఘాన్ని చీల్చడానికి ప్రభుత్వం ప్రయత్నించింది.
నేను శాసనసభలో ప్రశ్నిస్తే.. హోంగార్డులకు ఉద్యోగ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పిస్తామని సీఎం చెప్పారు.
అలా చెప్పి అయిదున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదు.
ఐజీ నేతృత్వంలో కమిటీ వేసినట్టు చేశారు.. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.
హోంగార్డుల శ్రమదోపిడీ, వెట్టి చాకిరిపై అనేక రోజులుగా మనం ప్రశ్నిస్తున్నా.. స్పందన లేదు.
నేను డాక్టర్లతో మాట్లాడాను.. రవీందర్​ ప్రాణాలు కాపాడాలని అందుకు నేను కృషి చేస్తానని చెప్పాను.
రవీందర్​ తల్లిదండ్రులు, ఆయన భార్య బాధపడుతున్నారు.
ఆయన ఎప్పటిలాగే బయటకు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా హోంగార్డుల పరిస్థితిని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాను.
ఇచ్చేదే.. అరకొర జీతాలు.. అవి సరైన సమయానికి ఇవ్వడం లేదు.
ఇతర అలవెన్సులు, హౌసింగ్​ స్కీముల సౌకర్యం లేదు.
గత పోరాటాలు, హోంగార్డుల ఐక్యత కారణంగా ఈరోజు కాస్తో కూస్తో జీతాలు పెరిగాయి.
డా. బీఆర్​ అంబేద్కర్​ మనకు హక్కులు ఇచ్చాడు.. మనం అవసరమైతే పోరాటం చేద్దాం కానీ… ప్రాణాలు తీసుకోవద్దు.
తల్లిదండ్రులు, భార్య, పిల్లలను ఎవరూ ఆగం చేయొద్దు..
ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గతం మాదిరిగా నేను మళ్లీ ముందు ఉంటా..
ఉద్యమం చేద్దాం.. శాంతియుతంగా చేద్దాం..
రవీందర్​ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.
సీఎం ఇచ్చిన హామీని ఇప్పటికైనా నిలబెట్టుకోవాలి.

తాజావార్తలు