హోదాపై నేనెప్పుడూ రాజీపడలేదు

– కేంద్రం చేయూతనివ్వాలన్న తన ఆరాటాన్ని వక్రీకరించారు
– సభలో భాజపా మినహా అన్నిపార్టీలు మద్దతుగా నిలిచాయి
– లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలు బాగా పోరాడారు
– అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలి
– పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన కొనసాగించండి
– నిరాశ, నిర్వేదంతోనే జగన్‌ వ్యక్తిగత విమర్శలు
– ఏపీ ప్రజల్లో బీజేపీ నేతలు మోసగాళ్లుగా మిగిలిపోయారు
– టెలీ కాన్ఫరెన్స్‌ లో ఎంపీలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జులై25(జ‌నంసాక్షి) : ప్రత్యేక ¬దాపై తానెప్పుడూ రాజీపడలేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చేదాకా ఆంధప్రదేశ్‌కు కేంద్రం చేయూత ఇవ్వాలన్న తన ఆరాటాన్ని వక్రీకరించేలా మాట్లాడటం సరైంది కాదని ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై  రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా ఎంపీలు బాగా పోరాడారని సీఎం అభినందించారు. సభలో భాజపా మినహా అన్ని పార్టీలు ఏపీకి మద్దతుగా నిలిచాయన్నారు. ప్రజల్లో ఒక నమ్మకం వచ్చిందని, అన్యాయాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం వచ్చిందన్నారు. అనేక పార్టీల సహకారం కూడగట్టామని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఎంపీలు, అధికారులకు సూచించారు. ప్రత్యేక ¬దాపై తానెప్పుడూ రాజీపడలేదన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు అనేక సమస్యలు ఉంటాయని, కొత్త రాష్ట్రం కాబట్టి ఇబ్బందులు అధిగమించేందుకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఆర్ధికంగా నిలబడేందుకు కృషి చేస్తుంటే అడ్డంగా మాట్లాడటం సరైంది కాదని సూచించారు. రాజ్యసభలో చర్చ ద్వారా దేశాన్ని తాము మెప్పించగలిగామని, అనేక పార్టీలను ఒప్పించగలిగామన్నారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్‌కు మద్దతుగా నిలబడ్డ పార్టీలకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో తెదేపా పోరాటం ఇకపై కూడా కొనసాగిస్తామని, ఇదే సహకారాన్ని ఆయా పార్టీలనుంచి ఇకపైనా పొందాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. వినూత్నంగా తెదేపా ఆందోళనలు ఉండాలన్నారు. అన్ని అవకాశాలను వినియోగించుకుని, పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అన్ని వేదికలపై ధ్వజమెత్తాలన్నారు. లోక్‌సభలో జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందని… రాజ్యసభలో వైఎస్‌ చౌదరి, సిఎం రమేష్‌ ప్రసంగాలకు స్పందన బాగుందని అన్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలని సీఎం సూచించారు. కళారూపాల ద్వారా నిరసనలు తెలపాలని ఆయా సమస్యలపై మంత్రిత్వ శాఖల వద్ద ఆందోళనలు చేయాలని చంద్రబాబు అన్నారు. అన్యాయాన్ని తెదేపా సహించదనేది ప్రజల్లోకి వెళ్లిందన్న ఆయన…, ఆ నమ్మకాన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. నిరాశ, నిర్వేదంతోనే జగన్‌ వ్యక్తిగత విమర్శలు, నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయతే ముఖ్యమని సీఎం తెలిపారు. రాజధాని, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్‌ అంశాలపై ఎంపీలు పోరాడాలన్నారు. ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల వద్ద ఆందోళనలు జరపాలని చెప్పారు. సభ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రులను నిలదీయాలని
ఎంపీలకు తెలిపారు. జీవీఎల్‌, పీయూష్‌ గోయల్‌ ఏపీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారని, ఏపీ ప్రజల దృష్టిలో బీజేపీ నేతలు మోసగాళ్లుగా మిగిలిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు.

తాజావార్తలు