హోదా కోసం ప్రధానిని నిలదీయడం తప్పా?

– చంద్రబాబును అసభ్య పదజాలతో తిడుతుంటే మోడీ నవ్వుతారా
– ఇదేనా పెద్దన్న హోదాలో ఉండి చేయాల్సిన పని
– ట్విట్టర్‌లో మోదీపై విమర్శలు గుప్పించిన ఏపీ మంత్రి లోకేష్‌
అమరావతి, జనవరి5(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రత్యేక ¬దా కోసం ప్రధాని మోదీని నిలదీయడం తప్పా? అని ఏపీ మంత్రి నారా లోకేశ్‌  ప్రశ్నిస్తున్నారు. హక్కుల కోసం చేస్తే ఢిల్లీలో పోరాటం చేస్తే లాఠీలతో చితకబాదడమే ప్రజాస్వామ్యమా? అని ట్విటర్‌ వేదికగా నిలదీశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో బీజేపీ నేతలు.. సీఎం చంద్రబాబును అసభ్య పదజాలంతో తిడుతుంటే సుదీర్ఘ అనుభవం ఉండి, దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన ప్రధాని మోదీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతమని లోకేశ్‌ నిలదీశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు చంద్రబాబును తిడుతున్నప్పుడు మోదీ నవ్వుతున్న వీడియోను లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. దేశం కోసం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు ఎలా చేస్తున్నారో.. రాష్టంలో పెట్టుబడుల సేకరణ కోసం సీఎం చంద్రబాబు కూడా విదేశాలకు వెళ్తున్నారని లోకేశ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం… ప్రధాని పర్యటనపై ఎప్పుడైనా షరతులు పెట్టిందా? అని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలతో ప్రధాని దేశాన్ని పాలించాలనుకోవటం సరికాదని సూచించారు. రాష్ట్రంకు న్యాయం చేయాలని అడగాల్సిన ఏపీ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేసి మోడీ జపం చేయడం సిగ్గుచేటన్నారు. ఏపీలో ప్రజలు ఇబ్బందులను ఓపక్క ఎవరి సహాయం లేకుండా పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృషిలో చేదోడువాదోడుగా ఉండాల్సిన ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం, అభివృద్ధిని అడ్డుకోవటం సరికాదన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై టీడీపీ పోరు సాగిస్తుంటే.. వైకాపా మాత్రం బీజేపీకి కొమ్ముకాస్తు ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని లోకేష్‌ విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ప్రతిపక్షాలను హెచ్చరించారు.