హోదా కోసం మానవహారాలు

– రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లెక్కిన విద్యార్థులు
– మానవహారాల్లో పాల్గొన్న కోటి మంది విద్యార్థులు
– విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట
– పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
అమరావతి, జులై25(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాలు పోరు బాట పట్టాయి. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన సమయంలో ఇచ్చిన హావిూలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవ హారాలు చేపట్టారు. ఏఐఎస్‌ఎఫ్‌ వంటి విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్షాలు తమ మద్దతును తెలియజేశాయి.
రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో చేపట్టిన మానహారాల్లో కోటి మంది విద్యార్థులు పాల్గొన్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. ప్రత్యేకహోదాను వెంటనే ఇవ్వాలని,హోదా ఇస్తేనే విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు చెబుతున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, ¬దా ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తిరుపతిలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర తీరును ఎండగడతామన్నారు. కాగా, మానవహారానికి తాము మద్దతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విూడియాకు చెప్పారు. తిరుపతి, విజయవాడల్లో కోటి మందితో మానవహారాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోరుతూ కృష్ణా జిల్లా నందిగామలోని గాంధీ సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం జరిగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టులను అడ్డుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరిగి కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు, చిత్తూరు, విజయనగరం జిల్లా పార్వతీపురం, నెల్లూరులో కూడా ఏఎస్‌ఎఫ్‌ఐ మానవహారాలు నిర్వహించింది. చాలా చోట్ల విద్యార్థులు మానహారాలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాటలు జరిగాయి.

తాజావార్తలు