1న విద్రోహ దినంగా పాటించాలి
ఆదిలాబాద్ , అక్టోబర్ 29 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది. నవంబర్ 1వ తేదీన నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆ సంఘం నాయకులు రాహుల్, సంతోష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతున్నప్పటికీ పెడచెవిన పెట్టిందని అలాంటిది బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో వీలినం చేసిన దినాన్ని తెలంగాణ ప్రజలు ఎందుకు నిర్వహించాలని వారు ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. ఈ ప్రాంతంలోని వనరులను దోచుకుంటు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. నవంబర్ 1న నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలపాలని విద్యార్థులకు, ప్రజలకు వారు పిలుపునిచ్చారు.