10 ఉత్తీర్ణతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు
10 ఉత్తీర్ణతతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు
* విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు బహుకరణ
మోత్కూరు మార్చి 29 జనంసాక్షి : పదవ తరగతి ఉత్తీర్ణతతోనే విద్యార్థినీ,విద్యార్థులకు మంచి భవిష్యత్తుని సూచిస్తుందని, విద్యార్థులకు 10వ తరగతి తొలిమెట్టని ఆరాధ్య ఫౌండేషన్ పొడిచేడు గ్రామ శాఖ అధ్యక్షుడు నర్రె సురేష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని పొడిచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నర్రె సురేష్ కుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నులు, పెన్సిల్ ఇతర వస్తువులను వితరణ గా అందించారు. ఈ సందర్భంగా నర్రె సురేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ఇష్టంతో కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని, 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలను భరించి మనలను చదివించిన మన తల్లిదండ్రులకు మనమిచ్చే గొప్ప కానుక మన విజయమేనని వారు అన్నారు. పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినప్పుడు ఆ తల్లిదండ్రుల ముఖంలో కనిపించే ఆనందానికి అవధులు ఉండవని, పాఠాలు బోధించిన టీచర్లకు, అష్ట కష్టాలు పడి చదివించిన తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకు వచ్చినందుకు గ్రామస్తులు ఎంతో ఆనంద పడతారని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఎదుగుదలకు, ఉన్నత స్థానాలకు ఎదగడానికి, మంచి ఉద్యోగాలు చేయడానికి, ఏ రంగంలోనైనా రాణించడానికి చదివే ప్రాధాన్యమని, ప్రతి ఒక్క విద్యార్థి అది దృష్టిలో ఉంచుకొని బాగా చదువుకొని గొప్ప మార్కులు సాధించుకోవాలని విద్యార్థులకు భవిష్యత్ లో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు మాజి సర్పంచ్ లేంకలపల్లి బిక్షం,ఫౌండేషన్ సభ్యులు బీసు అనిల్,కాసర్ల సైదులు,ఒర్సు రాజు,జిట్ట సైదులు,సిరిగిరి ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు ప్రతిమ, ఉపాధ్యాయులు లింగస్వామి,ఉమాదేవి,కల్యాణి,వాణి,విద్యార్థిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.