1035వ చేరుకున్న తెలంగాణ దీక్షలు
ఆదిలాబాద్, నవంబర్ 3 : ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1035వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస నేతలు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ఎలాంటి జప్యం చేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రజలు ఉద్యమిస్తున్నా రాజకీయ లబ్ధికోసం కేంద్రం వ్యవహరించడాన్ని వారు ఖండించారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలోని పార్టీలకు అతీతంగా నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.