1068వ రోజుకు చేరిన దీక్షలు
ఆదిలాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన కేంద్రం అఖిల పక్షం సమావేశం వేదిక మరింత జాప్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఐకాస నేతలు ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు గురువారం నాటికి 1068వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాల్సిన కేంద్రం అఖిల పక్షం సమావేశం పేరిట మరింత జాప్యం చేస్తే పార్టీ నామరూపం లేకుండా పోతుందని హెచ్చరించారు. కేంద్రం చేస్తున్న ప్రకటనలకు మోస పోకుండా నాయకులు పదవులకు, పార్టీ రాజీనామాలు చేసి మరింత ఒత్తిడి తెవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని ఈ మేరకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.