109 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

బంగ్లా ఖతం.. భారత్ సిడ్నీకి

0k6v0tcf

మెల్బోర్న్: ఎలాంటి అద్భుతం, సంచలనం జరగలేదు. భారత్ జైత్రయాత్రకు ఎదురేలేదు. ప్రపంచ కప్లో టీమిండియా సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ధోనీసేన 109  పరుగులతో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్పై భారీ విజయం సాధించింది. రోహిత్ వీరోచిత సెంచరీకి తోడు భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో బంగ్లా పోటీనివ్వలేకపోయింది. ఈ నెల 26న సిడ్నీలో జరిగే సెమీస్లో భారత్..  ఆస్ట్రేలియా లేదా పాకిస్థాన్తో తలపడనుంది. శుక్రవారం జరిగే ఆసీస్, పాక్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేత.. భారత్కు సెమీస్ ప్రత్యర్థి కానుంది.

303 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాను భారత బౌలర్లు 45 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ చేశారు. బంగ్లా జట్టులో నాసిర్ హొస్సేన్ (35) టాప్ స్కోరర్.  టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణించారు. ఉమేష్ నాలుగు, షమీ, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. ఓపెనర్లు తమీమ్, ఇమ్రుల్ కేస్ జట్టు స్కోరు 33 పరుగుల వద్ద అవుటయ్యారు. భారత పేసర్ ఉమేష్ యాదవ్.. తమీమ్ను అవుట్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ వెంటనే ఇమ్రుల్ను రనౌట్ చేశారు. అయినా బంగ్లా 73/2తో పోరాటం కొనసాగించింది. ఈ సమయంలో షమీ వెంటవెంటనే మహ్మదుల్లా, సౌమ్యా సర్కార్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత బంగ్లా కోలుకోలేకపోయింది. మహ్మదుల్లా క్యాచ్ను ధావన్ అద్భుతంగా పట్టుకున్నాడు. కాసేపటికే జడేజా బౌలింగ్లో షకీబల్ అవుటయ్యాడు. ఆ తర్వాత రహీం, నాసిర్, సబ్బీర్ రహ్మాన్  పోరాడినా జట్టును విజయం దిశగా నడిపించలేకపోయారు. బంగ్లా ఓటమిని కాసేపు ఆలస్యం చేశారంతే. రహ్మాన్ను ఉమేష్ అవుట్ చేయడంతో బంగ్లా కథ ముగిసింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 302 పరుగులు చేసింది.  ఓపెనర్ రోహిత్ శర్మ (126 బంతుల్లో 14 ఫోర్లు,3 సిక్సర్లతో 137) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. సురేష్ రైనా (65) హాఫ్ సెంచరీతో రాణించగా, ధావన్ 30, జడేజా 23 (10 బంతుల్లో నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. ఓపెనర్లు రోహిత్, ధావన్ 75 పరుగుల శుభారంభం అందించారు. కాగా ధావన్, కోహ్లీ వెంటవెంటనే అవుటయ్యారు. రహానె (19) నిరాశపరిచాడు. దీంతో భారత్ జోరు తగ్గింది. 30 ఓవర్లలో స్కోరు 120/3. రైనా వచ్చాక పరిస్థితి మారింది.   రోహిత్, రైనా క్రమేణా దూకుడు పెంచుతూ రెచ్చిపోయారు. దీంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రైనా హాఫ్ సెంచరీ, రోహిత్ సెంచరీ చేశారు. రైనా అవుటయినా రోహిత్ అదే జోరు కొనసాగించాడు. 47 వ ఓవర్లో రోహిత్ నిష్ర్కమించాడు. అప్పటికే జట్టు భారీ స్కోరుకు చేరువైంది. చివర్లో జడేజా బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు 300 పరుగులు దాటింది.