హోదా పోరాటం ఆగేది కాదు
కేంద్రం మనలను మోసం చేసింది
విద్యార్తుల ముఖాముఖిలో బాబు
కడప,ఆగస్ట్25(జనం సాక్షి ): ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. విభజ హావిూలను కేంద్రం విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిందని, విభజన చట్టంలోని హావిూలను కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేసుకోవాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని బాబు ఆకాంక్షించారు. నాలుగు నెలల్లో హంద్రీనీవా పూర్తి చేసి… కియా కార్ల పరిశ్రమకు నీళ్లు ఇచ్చామన్నారు. జనవరిలో కియా పరిశ్రమ ఉత్పత్తి ప్రారంభించబోతోందని తెలిపారు. కడప వేమన వర్సిటీలో విద్యార్థులతో బాబు ముఖాముఖి నిర్వహించారు. మనం కష్టం చేయాలి. ఆదాయం మాత్రం కేంద్రం తీసుకుంటోంది. కేంద్రం మనల్ని బానిసలుగా చూస్తోంది. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చి తీరుతాం. అవసరమైతే మేమే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పాం. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టాం. ఎరువుల వాడకం తగ్గించేందుకే ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ప్రపంచానికి ఆదర్శం కావాలి. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించాం. పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేశాం. రాబోయే రోజుల్లో గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం’ అని చంద్రబాబు చెప్పారు.