136పాయింట్లు లాభపడ్డ మార్కెట్లు

ముంబయి, ఆగస్టు6(జ‌నం సాక్షి ) : దేశీయ మార్కెట్లు లాభాల పంట పండించాయి. ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన సూచీలు చివరి వరకూ లాభాలను కొనసాగించాయి. బ్యాంకింగ్‌ షేర్ల లాభంతోమార్కెట్లు కళకళలాడాయి. రికార్డు స్థాయిలో లాభపపడ్డాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 57పాయింట్ల లాభంతో ఆరంభమైంది. ఉదయం ఒక దశలో నిఫ్టీ జీవన కాల గరిష్ఠం 11,424పాయింట్ల వద్దకు చేరింది. చివరకు సెన్సెక్స్‌ 135.73పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది. వర్షాకాలం చివరలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ గత వారం వెల్లడించడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపుతోంది. నేటి ట్రేడింగ్‌లో బ్యాంకుల షేర్లు బాగా లాభపడ్డాయి. ఆ తర్వాత ఆటో, ఎనర్జీ, లోహ రంగాలు షేర్లు లాభాలను నమోదుచేశాయి. యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతి ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌ తదితర కంపెనీల షేర్లు లాభపడ్డాయి. గెయిల్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, కొటక్‌ మహీంద్రా, టైటాన్‌ కంపెనీ, హెచ్‌యూఎల్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.68.78వద్ద ట్రేడవుతోంది.

———————————————–