14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు
ఆదిలాబాద్, నవంబర్ 10 : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు. 14వ తేదీ నుండి 20వ తేదీవరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు గ్రంథాలయాల అవశ్యకత, అక్షరాస్యతపై చైతన్యం కలిగించడం, గ్రంథాలయాలలో పాఠకుల సంఖ్యను పెంచడం తదితర అంశాల ఆధారంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల పాటు వివిధ పోటీలను నిర్వహిస్తామని అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 14న బాలల దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 15న పుస్తక ప్రదర్శన, 16న ఉద్యమ ప్రముఖులను స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ నెల 17న కవి సమ్మేళనాలు, సెమినార్‌లు, 18న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ నెల 20న అక్షరాస్యత దినోత్సవం నిర్వహించి గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.