16వేల కోట్లతో యుద్ధ హెలికాప్టర్లు
అమెరికాలోని బోయింగ్ సంస్థ నుంచి అపాచి, చినూక్ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోదం తెలిపింది. 250 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,490కోట్లు)ను వెచ్చించి 22 అపాచి, 15 చినూక్ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్ హాజరయ్యారు. ప్రస్తుతం భారత సైన్యం ఉపయోగిస్తున్న సోవియట్ తయారీ హెలికాప్టర్ల స్థానంలో కొత్తగా కొనేవాటిని ప్రవేశపెట్టనున్నారు. అపాచి హెలికాప్టర్లు దాడులకు ఉపయోగపడనుండగా, చినూక్ చాపర్లు సరుకు రవాణాకు ఉపయోగపడతాయి. అపాచి హెలికాప్టర్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో, రాత్రి సమయాల్లో కూడా పనిచేయగలవు. అలాగే నిముషం వ్యవధిలో 128 లక్ష్యాలను గుర్తించి, 16 లక్ష్యాలపై దాడులు చేయగలవు.