16 ప్రశ్నలకు బదులివ్వండి
మోడీ ఇంటికి బయల్దేరిన కేజ్రీవాల్
అడ్డుకున్న పోలీసులు
గాంధీనగర్, మార్చి 7 (జనంసాక్షి) :
గుజరాత్ అభివృద్ధిపై తాము సంధించే 16 ప్రశ్నలకు బదులివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రశ్నించారు. కేజ్రీవాల్ గుజరాత్ పర్యటన శుక్రవారం మరో మలుపు తిరిగింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలుస్తానని గాంధీనగర్‌లోని ఆయన ఇంటికి బయలుదేరిన కేజీవ్రాల్‌ను పోలీసులు మోడీ ఇంటి సవిూపంలో అడ్డుకున్నారు. ‘మోడీని 16 ప్రశ్నలకు సమాధానాలు అడగాలి. కలవడానికి ఆయన అంగీకరిస్తే కలుస్తా, లేదంటే అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పుడు కలుస్తా’నని కేజీవ్రాల్ తెలిపారు. మోడీ చెప్పుకుంటున్నట్లుగా గుజరాత్‌లో అభివృద్ధి జరగలేదని కేజీవ్రాల్ విమర్శించారు. అయితే ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకుండా మోడీని ఇకలుస్తానని బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు. అయితే ఇదంతా డ్రామా అని బిజెపి నేతలు కొట్టి పారేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేసు నమోదు అయింది. ఆయన గుజరాత్ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. అనుమతి లేకుండానే కేజీవ్రాల్ మైక్‌లు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించారని గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీధామ్‌లో ఆయన అనుమతిలేని సభ నిర్వహించారని కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలపై కేసు నమోదు అయింది. మరోవైపు కేజ్రీవాల్ రోడ్ షోలకు కూడా అనుమతి లేదని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇది కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ స్పష్టం చేసింది.