17న వైఎస్సార్‌సీపీలోకి ఇంద్రకరణ్, కోనప్ప
ఆదిలాబాద్, డిసెంబర్ 1 : జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎంపీ ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరులు మాజీ ఎమ్మెల్యే కోనప్పలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారైంది. జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నాయకులుగా చలామణి అవుతూ జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీలో ప్రాధాన్యత తగ్గడం, తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణికి నిరసనగా గత నెలలో పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరుతారోనని జిల్లాలో ప్రచారం జరిగింది. ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని, గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిసిన ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్పలు పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ నెల 17వ తేదీన నిర్మల్ పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి విజయమ్మ ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు నిర్ణయించారు. గత మూడు దశాబ్దలుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన ఇంద్రకరణ్‌రెడ్డి వైఎస్‌ఆర్ పార్టీలో చేరనుండడంతో, కాంగ్రెస్ పార్టీలోని ఆయన అనుచర వర్గంతో పాటు ఇతర నాయకులు ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయించారు.