17వ రోజుకు చేరుకున్న అంగన్వాడి కార్మికుల సమ్మె.

17వ రోజుకు చేరుకున్న అంగన్వాడి కార్మికుల సమ్మె.

కోడేరు, (జనం సాక్షి) సెప్టెంబర్ 27
మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ తలపెట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పనికి తగ్గ వేతనం ఇవ్వాలంటూ కనీస వేతనం 26000 ఇవ్వాలని రిటైర్మెంట్ అయిన టీచర్ కు 10 లక్షలు ఇవ్వాలని హెల్పర్ కు 5 లక్షలు మరియూ పని భారం తగ్గించాలని ఎట్టినుండే విముక్తి కలిగించాలని అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు విధానమే ఉండదని ఆనాడు కెసిఆర్ అన్నారని వారు గుర్తు చేశారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను మరియు హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడి టీచర్లు వారి కుటుంబాలను పిల్లలను ఇంటిదగ్గర వదిలి 17 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి టీచర్ల డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ సమ్మె విరమించేది లేదని ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.