18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడి
అహ్మదాబాద్ : 18 ఏండ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కేసులో దంపతులకు సిటీ సెషన్స్ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. భార్య సహకారంతో నిందితుడు బాబుభాయ్ వెగ్ధా బాలికపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అనాధాశ్రమంలో పెరిగిన బాధితురాలు 18 ఏండ్లు రాగానే అమ్మమ్మ వద్ద నివసిస్తోంది. 2018లో బాలికను తమతో పంపాలని తాము హాస్టల్‌లో చేర్పిస్తామని కుటుంబసభ్యులను నిందితుడు కోరాడు.
ఆపై బాలికను హాస్టల్‌లో చేర్పించకుండా నిందితుడి దంపతులు నిర్బంధించారు. బాలికను గుడిలోకి తీసుకువెళ్లిన నిందితుడు ఆమెను పెండ్లి చేసుకున్నాడు. నిందితుడు బాబుభాయ్ ఇరుగుపొరుగు వారికి బాలికను తన భార్యగా పరిచయం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు నిందితుడి భార్య మధువని బాలికను తన కోడలిగా స్దానికులకు పరిచయం చేసింది.
బాబుభాయ్ పలుమార్లు తనను బెదిరించి భార్య సహకారంతో తనపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆరోపించింది. నిందితుడు బాలికను అక్రమంగా నిర్భంధించాడని, స్ధానికుల ఎదుట బాలిక గురించి తప్పుడు ప్రచారం చేశారని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలితో పరస్పర అంగీకారంతో కాకుండా నిందితుడు భార్య సహకారంతో బలవంతంగా సంబంధం కొనసాగించాడని వెల్లడవుతోందని పేర్కొంది. గుజరాత్ బాధిత పరిహార పధకం కింద రెండు నెలల్లోగా బాధితురాలికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.