20వేల ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

 

– 12.26 లక్షల మందికి నిరుద్యోగ భృతి

– ‘ముఖ్యమంత్రి యువనేస్తం’గా నామకరణం

– ఈనెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు?

– పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ మంత్రి వర్గం

అమరావతి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాల భర్తీకి ఏపీ మంత్రి వర్గం సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం ఏర్పాటైన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. నాలుగు గంటల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిరుద్యోగ విధివిధానాలకు ఆమోదం తెలిపి ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరు నిర్ణయించారు. రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల ఖాళీలు, 9,000 టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీచేయాలని తీర్మానించారు.వుడాకు విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వుడాను విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న వుడా పరిధి 5,573 చదరపు కిలోవిూటర్లను 6,764.59 చ.కి.విూ. మేరకు పెంచారు. వీఎంఆర్‌డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు రానున్నాయి. ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కుప్పంలో ఎయిర్‌స్టిప్ర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నూతన చేనేత విధానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ సమావేశాలపైన కాబినెట్‌ లో చర్చ జరిగింది. ఈ నెల 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. వారం పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగల్న్‌ ఇచ్చారు. మంత్రి పితాని సూచన మేరకు ఆక్వా ప్రాజెక్ట్‌ సమస్యను పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

ఒక్కొక్కరికీ రూ.1000 నిరుద్యోగ భృతి

ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మేరకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.1000 అందిస్తామని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విూడియాతో మాట్లారు. ఈ పథకానికి ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ అని నామకరణం చేశామన్నారు. ఆగస్టు 3 లేదా 4న నిరుద్యోగుల నమోదు పక్రియ ఆరంభం అవుతుందని తెలిపారు. ప్రజాసాధికార సర్వేలాగా ఈ కేవైసీ జరుగుతుందన్నారు. 22నుంచి 35ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులకు భృతి అందజేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం అందజేస్తున్న సామాజిక పింఛన్‌లకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుందో దీనికీ అంతే ఉంటుందన్నారు. కుటుంబంలో ఒక్క వ్యక్తికే పింఛన్‌ ఇస్తున్నామని నిరుద్యోగ భృతిని మాత్రం కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ రూ.1000 ప్రతినెలా ఇస్తామన్నారు. యువతీ, యువకుల ఆన్‌లైన్‌పై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి నమోదు పక్రియ పూర్తిగా ఆన్‌లైన్లో నిర్వహిస్తామన్నారు. ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేస్తామని లోకేష్‌ తెలిపారు. నమోదు పక్రియ ముగిసిన 15రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు. ‘ముఖ్యమంత్రి – యువనేస్తం’ పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. అదేవిధంగా గతంలో నిర్వహించిన ప్రజా సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 12 లక్షల నిరుద్యోగులు ఉన్నారని మంత్రి లోకేశ్‌ తెలిపారు. డిగ్రీ లేదా పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి భృతి అందుతుందన్నారు. ఈ పథకం అమలు చేసేందుకు ప్రతి నెలా రూ.600 కోట్లు ఖర్చవుతుందని ఏడాదికి దాదాపు రూ.8,000 కోట్లు అవుతుందని తెలిపారు. రాష్ట్రం లోటులో ఉన్నా, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూ మేరకు అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోకి వచ్చిన వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు. నిరుద్యోగ భృతి అందించడంతో పాటు యువతీ యువకులకు అవసరమైన ఉద్యోగ నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పథకాలను సమ్మిళితం చేసి శిక్షణ అందిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలివైన ఉద్యోగార్థుల కోసం వెతుకున్నాయని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. రిజిస్టేష్రన్‌ వేదిక నుంచి తీసుకున్న యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి వారికి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు ఆన్‌ ద జాబ్‌ ట్రైనింగ్‌ అందిస్తామని తెలిపారు. దేశంలోనే ఇలాంటి వ్యవస్థీకృత పథకం లేదని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రయత్నించినా ఎక్కడా విజయవంతం కాలేదని ఆంధ్రాలో అవుతున్నందుకు సంతోషం వేస్తుందన్నారు. ఎన్నో రాష్ట్రాలు హావిూ ఇచ్చి తర్వాత వెనక్కి తగ్గాయన్నారు. రాష్ట్రంలో 721 సంస్థలు కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించాయని లోకేశ్‌ పేర్కొన్నారు. ఆంధ్రాలో ఆయా సంస్థలు రూ.1.49 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయన్నారు. 23,000 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడంతో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ ప్రగతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కారణమని లోకేశ్‌ అన్నారు. ఏపీకి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ప్రపంచంలో ఏ సంస్థలకు వెళ్లినా తలుపులు తెరుస్తున్నారని తెలిపారు. ఆ తర్వాత తమ మంత్రులంతా వెళ్లి పని పూర్తి చేసి తలుపులు మూసేస్తున్నామని ఛలోక్తి విసిరారు. గతంలో విద్యుత్‌ కొరతతో పోయేవని ఇప్పుడు 24 గంటలూ విద్యుత్‌ ఇస్తున్నమన్నారు.

 

తాజావార్తలు