200 కేజీల గంజాయి పట్టివేత
పోలీసుల నుంచి తప్పించుకున్న దుండగులు
విశాఖపట్టణం,సెప్టెంబర్ 27(జనంసాక్షి): విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్న అంతరరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాను ఎస్సై నరసింహా మూర్తి, హెడ్ కానిస్టేబుల్ రాజంనాయుడుతో కూడిన పోలీసుల బృందం గురువారం ఉదయం పట్టుకుంది. ఈ దాడిలో ఇద్దరు నిందితులు పరారీ కాగా మరో ఇద్దరు పట్టుబడ్డారు. గురువారం ఉదయం శ్రీరాంపురం వై జంక్షన్ వద్ద
వాహనాలను తనిఖీ చేస్తుండగా అనంతగిరి మండలం జీనబాడు నుంచి టాటా సఫారీ వాహనం, ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని ఆపి తనిఖీ చేస్తుండగా ఇద్దరు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాల్లో 200 కేజీల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నట్లు పోలీసులకు పట్టుబడిన హరియాణా రాష్ట్రం సోనాపతి జిల్లా పుర్ఖాజ్ రాజీ గ్రామానికి చెందిన ముఖేశ్ కఠారియా (23), తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మంగల్ హాట్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర సింగ్ (32) పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చోడవరం కోర్టుకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.