2019లో దేశ ప్రజలు ..
మోడీకి గుణపాఠం చెబుతారు
– ఏపీకి వ్యతిరేకంగా మోదీ-షా కుటిల యత్నాలు
– చంద్రబాబు ఆధ్వర్యంలో అన్నింటిని తిప్పికొడతాం
– గాలి జనార్దన్‌రెడ్డి, జగన్ ట్రాప్‌లోనే మోదీ పడ్డారు
– విజయవాడ ఎంపీ కేశినేని నాని
విజయవాడ, జులై28(జనం సాక్షి) : మోడీ నిరకుశ విధానంతో పాలన సాగిస్తున్నాడని, పార్లమెంట్‌లో చేసిన చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా అహంకార పూరితంగా ముందుకు సాగుతున్నారని 2019 ఎన్నికల్లో ప్రజలే మోదీకి గుణపాఠం చెబుతారని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో నాని ప్రసంగించారు. ప్రత్యేక ¬దా ఇచ్చేందుకు ఆంధప్రదేశ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. ఏపీకి వ్యతిరేకంగా అమిత్ షా-మోదీ అనేక కుటిల యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, భాజపాలకు తమ పార్టీ సమ దూరంలో ఉందని తెలిపారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎన్డీఏలో భాగమైన శివసేన, శిరోమణి అకాలీ దళ్ వంటి పార్టీలు కూడా మోదీకి అండగా నిలవలేదన్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకే న్యాయం జరిగిందని.. ఏపీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు.
వైకాపా ట్రాపులో తెదేపా పడలేదని.. జగన్-గాలి జనార్దన్ రెడ్డిల వలలో పడింది మోదీనేనని నాని విమర్శించారు. మోదీ దేశ ప్రధానిగా ఉండే అర్హతను కోల్పొయారని విమర్శించారు. ప్రధాని పదవిలో ఉన్న వారు హుందాగా ఉండాలని, కానీ మోదీ ప్రవర్తన ఆ స్థాయిలో లేదని మండిపడ్డారు. ప్రధాని తన స్థాయి మరిచి ఆ పదవికే మచ్చ తెచ్చారని.. దేశ ప్రజల్లో ఆయనపై ఉన్న అభిప్రాయాన్నే తాను చెప్పానని కేశినేని నాని వ్యాఖ్యానించారు. మరోవైపు మోదీపై పోరాడాల్సిన సమయంలో వైసీపీ పలాయనం చేసిందన్నారు. ఇది కుమ్మక్కు రాజకీయమేనని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశమంతటి దృష్టికి తీసుకెళ్లడంలో తెలుగు దేశం పార్టీ విజయవంతమయ్యిందన్నారు. ఇప్పటికైన మోదీ తన తీరును మార్చుకోవాలని, ఏపీకి ప్రత్యేక ¬దాను ప్రకటించాలని, లేకుంటే తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.